అద్దంకి : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో భావిలో శవమై తేలింది. భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పట్టణంలోని గుంజివారిపాలెంలో గురువారం వెలుగు చూసింది.
వివరాలు.. పంగులూరు మండలం కొప్పరపాడు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, లక్ష్మిల కుమార్తె రేణుక(24)కు పట్టణంలోని గుంజివారిపాలేనికి చెందిన మక్కెళ్ల పిచ్చియ్యతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రేణుక చిన్నప్పటి నుంచి రాజుపాలెం శాంతినగర్‌లో అమ్మమ్మ ధనమ్మ వద్ద పెరిగింది. పిచ్చియ్య వరంగల్ ప్రాంతంలో బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు.
ఈ నేపథ్యంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. రెండు నెలల క్రితం భార్య తన అమ్మమ్మ వద్దకు వచ్చి అక్కడే ఉంటోంది. దంపతుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఓ సారి రేణుక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భర్తను చూసేందుకు రేణుక అద్దంకిలోని గుంజివారిపాలేనికి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదుగానీ ఆమె తన భర్త ఇంటికి సమీపంలోని బావిలో శవమై తేలింది.
స్థానికులు రేణుక మృతదేహాన్ని గమనించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. వారు వచ్చి తమ బిడ్డను ఆమె భర్తే చంపి బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంటిపై చీర, దుప్పటి ఉండటం.. వాటికి కొద్ది దూరంలో రక్తపు మరకలు, బావి గిలకకూ రక్తం అంటి ఉండటంతో ఆమెది హత్యేనని బంధువులు చెబుతున్నారు. రేణుకను హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.
మృతురాలి బంధువులు.. స్థానికులతో కలిసి భర్త పిచ్చియ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అత డిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. రేణుక ఎలా చనిపోయిందో పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
వివాహిత ఆత్మహత్య?
Published Fri, Oct 3 2014 2:32 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement