
వాల్మీకులను ఎస్‌టీలుగా గుర్తించాలి
కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం వాల్మీకులను ఎస్‌టీలుగా గుర్తించి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే లక్షలాదిమందితో ప్రభుత్వంపై దండయాత్ర చేపడతామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఏపీ రాష్ట్ర కమిటి హెచ్చరించింది. వాల్మీకులకు ఎస్‌టీ రిజర్వేషన్ సాధన కోసం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్‌పీఎస్) అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కుప్పం నుంచి హైదరాబాదుకు చేపట్టిన 11 వందల కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ధర్నానుద్దేశించి కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్ మాట్లాడుతూ.. ఏపీలోని 5 జిల్లాల్లో వాల్మీకి, బోయలను ఎస్‌టీలుగా గుర్తిస్తున్నా.. మిగతా 8 జిల్లాల్లో బీసీలుగానే గుర్తిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో వాల్మీకులను ఎస్‌టీలుగా గుర్తిస్తామంటూ ప్రకటించిన సీఎం కేసిఆర్ చెల్లప్ప కమిటీని నియమించారని, వాల్మీకులను ఎస్‌టీలుగా గుర్తిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏడాది గడిచినా అమలు చేయక పోవడం శోచనీయమన్నారు.
ఆలూరు ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ వాల్మీకులను ఎస్‌టీల్లో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజకీయ లక్ష్యం కోసం కాకుండా అణిచివేతకు గురవుతున్న వాల్మీకులకు రిజర్వేషన్లు సాధించేందుకే పాదయాత్ర చేపట్టానని అన్నారు. వీఆర్‌పీఎస్ గౌరవాధ్యక్షులు డాక్టరు పార్థసారథి, ప్రధానకార్యదర్శి ఎల్ భాస్కర్, ఉపాధ్యక్షులు అద్దాల నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.