టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు చేసి బయటకు వస్తున్న ఐటీ అధికారులు
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మొబర్లీపేటకు చెందిన ముగ్గురు అన్నదమ్ములైన టీడీపీ నేతల ఇళ్లల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఐటీ దాడులు జరిగాయి. టీడీపీకి చెందిన మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఆయన సోదరులైన టీడీపీ నాయకులు అల్లాడ వాసు, అల్లాడ శరత్‌బాబు ఇళ్లలో సోదాలు జరిగాయి. మొబర్లీపేటలో ఈ ముగ్గురి ఇళ్లున్నాయి. తొలుత ఐటీ అధికారులు స్వామినాయుడు, శరత్‌బాబు ఇళ్లలోనే సోదాలు చేశారు. సాయంత్రం నుంచి వారి సోదరుడైన వాసు ఇంట్లో కూడా సోదా చేశారు. ఐటీ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎవరినీ ఇళ్లలోకి అనుమతించకుండా సోదాలు కొనసాగించారు. దీంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు పట్టణ టీడీపీలో ముఖ్యంగా స్వామినాయుడు కీలక నాయుకుడిగా ఉన్నారు. మిగతా ఇద్దరు కూడా ఈ పార్టీ నాయకులుగా ఉన్నారు. ఈ అన్నదమ్ముల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పట్టణంలో చర్చనీయాంశమైంది.
రాజమహేంద్రవరం ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇటీవల ఈ ముగ్గురు తమకు చెందిన అత్యంత విలువైన భూములను రియల్ ఎస్టేట్ అవసరాలకు రూ.కోట్లలో విక్రయించినట్టు తెలిసింది. ఈ ఆదాయానికి సంబంధించి కాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని.. అందుకే ఈ సోదాలు జరిగినట్టు తెలిసింది. ఆ ముగ్గురి ఇళ్లల్లోని డాక్యుమెంట్లు, ఇతర ఆస్తులను అధికారులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలో ఓ ఆడిటర్ వద్దకు కూడా అధికారులు వెళ్లి ఆ అన్నదమ్ముల ఆదాయాలకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉన్న కంప్యూటర్, ఇతర ధ్రువపత్రాలను తమ వెంట తీసుకుని వచ్చి తిరిగి అవే ఇళ్లల్లో సోదాలు కొనసాగించారు. ఈ అన్నదమ్ముల్లో ఇద్దరు మద్యం సిండికేట్ వ్యాపారాల్లో కూడా ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరించినట్టు తెలిసింది. అయితే వీరు అమ్మిన భూమికి సంబంధించి అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారని, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని, పూర్తి సొమ్ములు చెల్లింపులు కాలేదని స్థానిక టీడీపీ నేతలు కొందరు చెబుతున్నారు. మొత్తం మీద టీడీపీ నేతలైన అన్నదమ్ముల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment