హోం..వర్క్‌! | IT Companies Interested In Work From Home | Sakshi
Sakshi News home page

హోం..వర్క్‌!

Published Wed, Apr 22 2020 3:38 AM | Last Updated on Wed, Apr 22 2020 4:58 AM

IT Companies Interested In Work From Home - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు సాచిన వేళ ‘వర్క్‌ ఫ్రం హోం’ (ఇంటి నుంచే పనిచేయడం) విధానమే ఉత్తమమని ఐటీ, బయో టెక్నాలజీ కంపెనీలు భావిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులతో పని చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఇచ్చిన సడలింపులను వినియోగించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికిప్పుడు కార్యాలయాల నుంచి పనిచేసే విధానాన్ని పునఃప్రారంభించేందుకు ఏమాత్రం సుముఖంగా లేవు. ఉద్యోగులే కాదు యాజమాన్యాలు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నాయి. ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానాన్ని సాఫీగా కొనసాగించేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌  కంపెనీస్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

93 % మంది ఇంటి నుంచే..
► ఏప్రిల్‌ 20 నుంచి 50 % మంది ఉద్యోగులతో పని చేయించుకోవచ్చని సడలింపులు ఇచ్చినప్పటికీ పలు కంపెనీలు ఉద్యోగులతో ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలతోసహా అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రావద్దని సూచించాయి.
► తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, హైదరాబాద్‌లతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఐటీ కంపెనీలు ఇదే విధానాన్ని ఆనుసరిస్తున్నాయి.
► 93 % మంది ఉద్యోగులు ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానంలోనే పని చేస్తున్నారు.
► దేశం మొత్తం మీద ఐటీ కంపెనీల్లో 7 % మంది ఉద్యోగులే ఆఫీసులకు వెళ్తున్నారు. తప్పనిసరైన కొన్ని రకాల పనులనే ఆఫీసు నుంచి చేస్తున్నారు. 5 జీ ఇంజనీరింగ్‌ సర్వీసులకు సంబంధించి ల్యాబ్‌ల్లో చేయాల్సినవి, వైద్య బీమా పోర్టబులిటీ లాంటి వాటికి సంబంధించి మాత్రమే కార్యాలయాలకు హాజరవుతున్నారు. అది కూడా రొటేషన్‌ విధానంలో విధులు నిర్వహిస్తున్నారు.
► లాక్‌డౌన్‌ సమయంలో 50 శాతం మంది సిబ్బందితో కార్యాలయాలను నిర్వహించాలంటే యాజమాన్యాలు నిబంధనల ప్రకారం ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే దేశవ్యాప్తంగా ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. 

జూన్‌ వరకు ఇలాగే
► జూన్‌ నెలాఖరు వరకు ‘వర్క్‌ ఫ్రం హోం విధానంలోనే ఉద్యోగులతో పనిచేయించాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి.
► వర్క్‌ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నందున ఐటీ కంపెనీలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని నాస్కామ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది
► ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, రూటర్లు, వెబ్‌క్యామ్‌లు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, ఇతర ఐటీ సంబంధిత ఉపకరణాలను అత్యవసరాల జాబితాలో చేర్చాలని కోరింది.  వీటిని ఇ–కామర్స్‌ ద్వారా కొనుగోలు/సరఫరా చేసేందుకు అనుమతించాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement