సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ కలకలంతో గ్రేటర్ పరిధిలో ఐటీ ఉద్యోగులు మరికొంత కాలం పూర్తిస్థాయిలో ఇంటి నుంచే పనిచేసే(వర్క్ ఫ్రం హోమ్) అవకాశాలు కనిపిస్తున్నాయి. మహానగరంలో చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఐటీ కంపెనీలు సుమారు 1500 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు ఏడు లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం బడా ఐటీ కంపెనీల్లో 5 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. మధ్యతరహా కంపెనీల్లో 25 శాతం మంది..చిన్న కంపెనీల్లో 70 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) వర్గాలు పేర్కొన్నాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని కంపెనీల్లో కలిపి పూర్తిస్థాయిలో 50 శాతం మంది కార్యాలయాల నుంచి పనిచేసే అవకాశాలున్నట్లు తెలిపాయి. ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో అంటే ...50 శాతం మంది ఇంటి నుంచి..మరో 50 శాతం మంది ఆఫీసుకు వచ్చి పనిచేసే హైబ్రీడ్ విధానం కూడా అమల్లో ఉంటుందని పేర్కొన్నాయి. కాగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతాయన్న ఆందోళన ఐటీ రంగాన్ని వెంటాడుతోందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.
చదవండి: తెలంగాణ: జైళ్లలో మగ్గుతున్న యువత.. హత్యలు, లైంగిక దాడులే అధికం..
తగ్గని ఉత్పాదకత...ఎగుమతులు
► దేశంలో ఐటీహబ్‌గా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ ఆయా కంపెనీల ఎగుమతులు..ఉద్యోగుల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఐటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
► జాతీయ స్థాయి సగటు కంటే ఏటా ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని పేర్కొనడం విశేషం.
► ఈ రంగంలో నూతనంగా వస్తున్న అధునాతన సాంకేతికతను ఒడిసిపట్టుకొని నూతన ప్రాజెక్టు కాంట్రాక్టులు సాధించడంలో నగరంలోని ఐటీ కంపెనీలు మందున్నట్లు హైసియా వర్గాలు తెలిపాయి.
► గతేడాది ఐటీ ఎగుమతుల్లో సుమారు 13 శాతం వృద్ధి సాధించగా.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేయడం విశేషం.
► నగరంలో నిపుణుల కొరత లేకపోవడం, ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు అనువైన వాతావరణం ఉండడంతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎఎస్‌ఐపాస్, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలు దేశ, విదేశీ ఐటీ కంపెనీలు వెల్లువలా గ్రేటర్‌సిటీకి తరలివచ్చేందుకు కారణమౌతోందని ఈ రంగం నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చదవండి: హైదరాబాద్ ఆర్‌ఆర్‌ఆర్.. 320 కి.మీ.
గ్రేటర్ ఐటీ రంగానికి ఢోకాలేదు
కోవిడ్ కలకలకం..ఒమిక్రాన్ ఫీవర్ ఇలా ఎన్ని అవాంతరాలు ఎదురైనా గ్రేటర్‌లో ఐటీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. ఏటా ఉపాధి కల్పన, ఎగుమతుల విషయంలో గణనీయమైన వృద్ధిరేటు సాధిస్తోంది. నూతన ప్రాజెక్టులు సాధించడంలో మన ఐటీ కంపెనీలు ముందుంటున్నాయి. ఈ రంగానికి ఎలాంటి ఢోకా లేదు. – భరణి, హైసియా అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment