విశాఖకు పోల‘వరమే’
ఎడమ కాలువతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు
సత్యనారాయణ
దేవరాపల్లి: పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయి నీరు వస్తే విశాఖపట్నం తాగు నీటి సమస్యతో పాటు పారిశ్రామిక అవసరాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్, ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు ఎస్. సత్యనారాయణ తెలిపారు. రైవాడ జలాశయం అతిథి గృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎడమ కాలువ పనులు త్వరగతిన పూర్తి చేసేందుకు రైతులు, నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రైవాడ సమస్యకు పరిష్కారం: పోలవరం నీరు విశాఖకు వస్తే అప్పుడు రైవాడ నీరు రైతులకు అంకితం చేసే అవకాశం ఉంటుందన్నారు. రైవాడ నీటిని రైతులకు అంకితమిస్తే అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలతో పాటు అదనంగా మరో 2 వేల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉందన్నారు. పోలవరం జిల్లాకు వచ్చేలోగా అదనపు ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేసేందుకు కాలువుల నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలన్నారు.
ఎత్తిపోతల పథకం మేలు
కృష్ణా నదిపై నిర్మించిన పట్టిసీమ మాదిరిగా పురుషోత్తమపురం వద్ద ఎడమ వైపు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేస్తే విశాఖపట్నానికి త్వరితగతిన నీరు వస్తుందని, దీని సాధనకు రైతులు, ప్రజా ప్రతినిధులు పోరాటం చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ఎడమ కాలువ 2017 జూన్ నాటికి పూర్తవుతుందన్నారు. పోలవరం కాలువను పొడిగించి విశాఖపట్నం దాటిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చన్నారు. విశాఖపట్నలో 3 లక్షల ఎకరాలకు సాగు నీటి కష్టాలకు మోక్షం లభిస్తుందన్నారు.