
సాక్షి, విజయవాడ: ఐటీ అధికారులు విజయవాడలో మెరుపు దాడులు చేశారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్లకు ఐటీ అధికారులు చెమటలు పట్టించారు. అధికారుల దాడులతో ఒక్కసారిగా కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాలు, డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ.. ఆదాయపన్ను శాఖకు పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ను ఐటీ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఐటి రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో కోట్ల రూపాయల్లో ఆదాయం ఉన్నప్పటికీ పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ అధికారులు పరిశీలనలో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి ఐటీ అధికారులు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment