సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఆర్‌పీపీఎల్) కంపెనీ లీలలు జిల్లాలోనూ కొనసాగుతున్నాయి. రమేష్ కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ విస్తరణ పనుల్లో రిత్విక్ వ్యవహారంపైనా చర్చ సాగుతోంది. ఈ పనులను తప్పుడు పత్రాలతో దక్కించుకోవడమే కాకుండా.. చేయకపోయినప్పటికీ నిధులు కొల్లగొట్టింది. కంపెనీకి విధించిన గడువు ముగిసినప్పటికీ కనీసం నోటీసులు ఇచ్చేందుకు సైతం అధికారులు సాహసించడం లేదు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. వాస్తవానికి హంద్రీ– నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను తప్పుడు పత్రాలతో రిత్విక్ సంస్థ దక్కించుకుంది.
పైగా ఏడాది కాలంగా పనులు చేపట్టడం లేదు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలి. అయినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించకూడదన్న నిబంధన సైతం పక్కన పెట్టింది. సగం సగం చేసిన పనులను వారికి అప్పగించింది. సదరు సబ్ కాంట్రాక్టర్లు కూడా ప్రస్తుతం పనులు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న రిత్విక్ సంస్థ.. సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులకు మాత్రం బిల్లులు ఇవ్వడం లేదు. టెండర్ దశలోనే రింగు కావడమే కాకుండా ఇతర కంపెనీలపై అనర్హత వేటు వేయించి.. అధిక ధరకు ఈ పనులను దక్కించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక రూపొందించింది. తాజా ఐటీ దాడుల నేపథ్యంలో రిత్విక్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
దోపిడీ జరిగిందిలా..
హంద్రీ –నీవా ప్రధాన కాలువను 11 నుంచి 20 మీటర్ల మేర వెడల్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.831.09 కోట్లతో అంచనాలు రూపొందించింది. టెండర్‌లో పాల్గొనే కంపెనీ ఇదే తరహా కాలువ వెడల్పు పనులను ఏడాదిలో రూ.328.75 కోట్ల విలువైనవి లేదా మూడు నెలల కాలంలో రూ.82.18 కోట్ల విలువైనవి ప్రధాన కాంట్రాక్టర్‌గా చేసి ఉండాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే.. ఇందుకు భిన్నంగా సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేసిన రిత్విక్ సంస్థను టెండర్‌లో పాల్గొనేందుకు అనుమతించడమే కాకుండా ఏకంగా అధిక ధరకు కట్టబెట్టారు. పోటీగా నిలబడి తక్కువ ధరనే కోట్ చేసినప్పటికీ..సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఐవీఆర్‌సీఎల్, ప్రసాద్‌లను పక్కకు తప్పించారు. మొత్తం మూడు ప్యాకేజీలుగా పిలిచిన ఈ పనుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మూడు కంపెనీలకు చెరో ప్యాకేజీ అప్పగించారు. అయితే, రిత్విక్ కంపెనీ సమర్పించిన మొత్తం డాక్యుమెంట్లపై కేంద్ర నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని సేకరించాయి. అర్హత ఉందంటూ ఛత్తీస్‌గఢ్ నుంచి రిత్విక్ తెచ్చిన వివరాలు సరైనవి కావని కూడా తేల్చాయి.
రెండో ప్యాకేజీ పనుల్లో...
వాస్తవానికి హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను మొదట్లో 14 ప్యాకేజీలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత తమఅనుకూల కంపెనీలకే దక్కేలా మూడు ప్యాకేజీలుగా విడగొట్టింది. ఇందులో కర్నూలు జిల్లాలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి. ప్రధాన కాలువ –1.150 కిలోమీటర్ నుంచి 78.60 కిలోమీటర్ల వరకు రూ.326.75 కోట్లతో ఒక ప్యాకేజీగా, 79.75 కిలోమీటర్ల నుంచి 134.27 కిలోమీటర్ల వరకు రూ.224.42 కోట్లతో రెండో ప్యాకేజీగా విభజించారు.
ఇక మిగిలింది అనంతపురం జిల్లాలో 134 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు రూ.279.92 కోట్లతో మూడో ప్యాకేజీగా విభజించారు. ఈ మూడు ప్యాకేజీ పనులను ఒక్కో కంపెనీకి అప్పగించారు. ఇందులో రెండో ప్యాకేజీ పనులను రిత్విక్ కంపెనీ చేపట్టింది. మొబిలైజేషన్ అడ్వాన్సు తీసుకుని పనులు చేయకుండానే ఆ సంస్థ చెక్కేసింది. ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment