చంద్రబాబు అవినీతి బట్టబయలు | IT Raids On Chandrababu Naidu Ex PS Yields Rs 2,000 Crore | Sakshi
Sakshi News home page

మచ్చుకు రూ.2,000 కోట్లు

Published Fri, Feb 14 2020 4:29 AM | Last Updated on Fri, Feb 14 2020 8:03 AM

IT Raids On Chandrababu Naidu Ex PS Yields Rs 2,000 Crore - Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సాగించిన కొండంత అవినీతి బాగోతంలో గోరంత బట్టబయలైంది. ఎవరెవరి నుంచి ఎంతెంత మొత్తం కమీషన్లుగా అందిందో ఆయన పీఏ డైరీల్లో స్పష్టంగా రాసి ఉండటం ఐటీ అధికారులను నివ్వెరపోయేలా చేసింది.

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కమీషన్ల బాగోతాన్ని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్లను రాకెట్‌గా ఏర్పాటు చేసి.. భారీ నగదు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా గురువారం విడుదల చేసిన ప్రకటన సంచలనం రేపింది. అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపడం (ఓవర్‌ ఇన్‌వాయిసింగ్‌), బోగస్‌ బిల్లులు సృష్టించడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఇందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలను సేకరించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ఈ అక్రమ లావాదేవీలకు సంబంధించి అనేక పత్రాలతోపాటు ఈ–మెయిళ్లు, వాట్సాప్‌ మెసేజ్‌లను సేకరించింది. విదేశీ అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థల నుంచి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా నగదును అక్రమంగా తరలించినట్లు తేల్చింది. పుస్తకాల నిర్వహణ, ట్యాక్స్‌ ఆడిటింగ్‌ లేకుండా రూ.2 కోట్లలోపు టర్నోవర్‌ ఉండేలా చిన్న చిన్న బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలను సృష్టించి.. నగదును తరలించినట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించింది. (చంద్రబాబును తక్షణం అరెస్టు చేయాలి: వైఎస్సార్‌సీపీ)

తప్పుడు చిరునామాలు.. షెల్‌ కంపెనీలు
చిన్న చిన్న సబ్‌ కాంట్రాక్టు సంస్థలను సృష్టించారని, వాటి రిజిష్ట్రేషన్‌లో చూపిన చిరునామాలో ఆ సంస్థలు లేకపోగా.. షెల్‌ కంపెనీలు ఉన్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. ఈ బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు.. మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఒకే ఐపీ అడ్రసు (కంప్యూటర్‌) నుంచి దాఖలు చేసినట్లుగా తేల్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ఒక ప్రధాన కాంట్రాక్టు సంస్థకు వచ్చిన మొత్తాన్ని బోగస్‌ కాంట్రాక్టు సంస్థలకు మళ్లించినట్లు గుర్తించింది.

వీటికి సంబంధించి ముఖ్యుడి(చంద్రబాబు)కి సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్‌ నుంచి కీలకమైన ఆధారాలను సేకరించినట్లుగా ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మూడు ప్రముఖ కాంట్రాక్టు సంస్థలు.. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలపై హైదరాబాద్, విజయవాడ, కడప, ఢిల్లీ, పూణేలలో 40 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరిపిన విషయం విదితమే. ఈ సోదాల్లో లెక్క చూపని నగదు రూ.85 లక్షలు.. రూ.71 లక్షల విలువైన ఆభరణాలతోపాటు 25 బ్యాంక్‌ లాకర్లను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. (‘చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం’)

కమీషన్లే పరమావధి 
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2014 జూన్‌ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 2019 మే 29 వరకు అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహరించారు. పనుల అంచనా వ్యయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేయడం, కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలు జరపడం.. ఎక్కువ మొత్తంలో కమీషన్‌లు ఇచ్చిన సంస్థకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్లు నిర్వహించడం.. అనుకున్న మేరకే అధిక ధరలకు ఆ సంస్థకు పనులు అప్పగించి కమీషన్‌లు వసూలు చేసుకోవడాన్ని చంద్రబాబు వ్యాపకంగా చేసుకున్నారు.

ముంబై కేంద్రంగా పని చేసే ఒక బడా కాంట్రాక్టు సంస్థ కార్యాలయంలో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో రూ.150 కోట్లకుపైగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యుడికి అక్రమంగా చేరినట్లు ఐటీ శాఖ ఇటీవల ప్రకటించింది. ఆ సంస్థలో నిర్వహించిన సోదాల్లో లభ్యమైన ఒక ఆధారంతో చంద్రబాబుకు సన్నిహితులైన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, ఆర్వీఆర్‌ ఇన్‌ఫ్రా, లోకేష్‌ బినామీ నరేన్‌ చౌదరికి చెందిన డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కార్యాలయాలపై ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైంది.

ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు
కాంట్రాక్టు సంస్థల నుంచి కమీషన్ల రూపంలో చంద్రబాబు కొల్లగొట్టిన వేలాది కోట్ల రూపాయాల నల్లధనాన్ని విదేశాలకు తరలించి.. అక్కడి నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో తనకు చెందిన సంస్థల్లోకి వచ్చేలా చేశారు. ఈ విషయం ఐటీ శాఖ దర్యాప్తులో బట్టబయలైంది. విదేశీ పెట్టుబడుల రూపంలో ఒక సంస్థకు వేలాది కోట్ల రూపాయలు తరలించారని.. ఆ ధనాన్ని బాబుకు చెందిన చిన్న చిన్న బోగస్‌ కంపెనీలకు మళ్లించారని తేల్చింది.

కమీషన్ల వసూలులో చాణక్యం
కాంట్రాక్టు సంస్థల నుంచి కమీషన్ల వసూలులో చంద్రబాబు తనదైన శైలిలో చాణక్యాన్ని ప్రదర్శించారు. కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థల వద్ద సబ్‌ కాంట్రాక్టు పనులు చేస్తున్నట్లు బోగస్‌ సంస్థలను సృష్టించారు. ఆ సంస్థలు పనులు చేయకున్నా, చేసినట్లు చూపి.. బిల్లులు చేసుకున్నారు. ఈ అక్రమాల నుంచి ఐటీ, ఈడీ వంటి సంస్థల కన్నుగప్పేందుకు తనకు మాత్రమే సాధ్యమైన తెలివితేటలను ప్రదర్శించారు. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థల వార్షిక టర్నోవర్‌ రూ.2 కోట్లకు మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని వల్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆడిటింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. పుస్తకాలను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా కేవలం మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థల నుంచి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా రూ.2,000 కోట్లను చంద్రబాబు కొల్లగొట్టినట్లు ఐటీ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. ఈ తతంగం చూస్తుంటే మిగతా కాంట్రాక్టు సంస్థల నుంచి చంద్రబాబు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయాలు కొల్లగొట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

ఆ డైరీల్లో పూసగుచ్చినట్లు..
రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో పని చేస్తున్న పెండ్యాల శ్రీనివాస్‌.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అధికారంలో ఉన్నప్పుడూ రెండు దశాబ్దాలపాటు చంద్రబాబుకు వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)గా వ్యవహరించారు. చంద్రబాబుకు సంబంధించిన లావాదేవీలన్నీ శ్రీనివాసే నిర్వహించే వారని టీడీపీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. శ్రీనివాస్‌ నివాసాల్లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో 2014, 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకుంది. చంద్రబాబుకు ఏయే కాంట్రాక్టు సంస్థల నుంచి ఏ తేదీన ఎంత మొత్తంలో ఏయే సబ్‌ కాంట్రాక్టర్ల పేర్లతో కమీషన్‌ల రూపంలో వసూలు చేసిందీ.. వాటిని ఏయే సంస్థలకు మళ్లించిందీ.. నల్లధనాన్ని ఎలా విదేశాలకు మళ్లించిందీ.. చంద్రబాబు కుటుంబ సంస్థలకు నగదు రూపంలో వచ్చిన వివరాలు.. చంద్రబాబు, లోకేష్‌లకు నగదు రూపంలో ఇచ్చిన వివరాలు ఆ డైరీల్లో శ్రీనివాస్‌ స్పష్టంగా పేర్కొన్నారు. వాటి ఆధారంగా ఐటీ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.రెండు వేల కోట్ల నల్లధనం కుంభకోణం బయటపడింది. (చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement