సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదాయం పన్ను(ఐటీ) వసూళ్లు ఏటా పెరుగుతున్నాయి. కార్పొరేట్ రంగంతో పాటు, అన్ని వర్గాల్లోనూ ఇదే పురోగతి కొనసాగుతోంది. 2005-06 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 6,683 కోట్ల ఆదాయం పన్ను వసూలైతే.. 2013-14 నాటికి ఇది రూ. 30 వేల కోట్లు దాటింది. 2005 నుంచి 2010 నాటికి దాదాపు 210 శాతం పన్ను వసూళ్లు పెరిగినట్టు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత కాలంలో ప్రత్యేక, సమైక్య ఉద్యమాల ఊపు కారణంగా పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలోకి వెళ్లింది. దీంతో కార్పొరేట్ రంగం కుదేలై, పన్ను చెల్లింపులు గణనీయంగా తగ్గాయి.
గడచిన ఐదేళ్లుగా సామాన్య, మధ్య తరగతి నుంచి పన్ను చెల్లింపుల శాతం పెరిగింది. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గం ఐటీ రిటర్న్‌లు మూడింతలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్ రిటర్న్‌ల సంఖ్య 20 లక్షలకు చేరింది. బ్యాంకుల రుణాల మంజూరుకు ఐటీ రిటర్న్‌లే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరూ దాఖలు చేస్తున్నారు. రూ. 10 లక్షల లోపు ఐటీ చెల్లింపులు మూడేళ్లుగా 125 శాతం పెరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తొలుత చెప్పినప్పటికీ, చివరలో తప్పనిసరి చేశారు. దాంతో ఈ ఏడాది ఆన్‌లైన్ రిటర్న్‌ల సంఖ్య 3.5 లక్షలు పెరిగింది. అయితే, ప్రధానంగా కార్పొరేట్ రంగం నుంచి వసూళ్లు తగ్గడంతో ఈ ఏడాది పన్ను టార్గెట్లు పూర్తికాలేదు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో మందకొడితనం వల్ల ప్రతికూల ఫలితాలొచ్చాయి. 2012-13 సంవత్సరంలో పన్ను వసూళ్ళు రూ. 29 వేల కోట్లు. 2013-14లో రూ. 36 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఐదేళ్లలో 200% పెరిగిన ఐటీ వసూళ్లు
Published Thu, Jan 2 2014 12:45 AM | Last Updated on Thu, Sep 27 2018 3:54 PM
Advertisement
Advertisement