అనంతపురం అర్బన్: అన్ని వేళలా కార్యకర్తలకు అండగా ఉంటామని పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు.
అనంతపురం అర్బన్:
అన్ని వేళలా కార్యకర్తలకు అండగా ఉంటామని పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. స్థానిక మడకశిర భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేకని రఘువీరా అన్నారు. రైతులకు ప్రకటించిన రుణమాఫీ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. జిల్లాకు రైతాంగానికి రావాల్సిన రూ. 640 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ వెంట నే ప్రభుత్వం విడుదల చేసి రైతు ఖాతాల్లోకి జమా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ప్రజల అవసరాల కోసం అనంతపురం నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలకు అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా ద్వారా పీఏబీఆర్ జలాశయం నుంచి తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాకు 15 నుంచి 20 టీఎంసీలు నీటిని తెచ్చే అవకాశం ఉన్నా చేతకాని ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఇప్పటికి కేవలం 5.5 టీఎంసీలు మాత్రమే తెచ్చారన్నారు. ఈ నీటితో సరిపెట్టుకుంటే కరువు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్‌లో జిల్లా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందన్నారు. జిల్లాలో 70 శాతం వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం ఉండగా ఇప్పుడు రూ. 2 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామనడం హాస్యస్పదమన్నారు.
ఓఎంసీ గనుల లెసైన్స్‌ను కుద్రేముఖ్ కంపెనీకి కేటాయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత పాలకులు కొందరు లెసైన్స్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షులు కోట సత్యం, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మండ్ల నరసింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ నాగరాజు, కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడు బి.వై. రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ప్రత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.