
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరైన కోరుకొండ సభ కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. మునుపెన్నడూ చూడనంతమంది జనాలను కోరుకొండ వాసులు చూశారు. ఇసుక వేస్తే రాలనంతగా కిలోమీటరు మేర ప్రజలు బారులు తీరారు. అభిమాన నేత రాక కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఆయన ప్రసంగం కోసం మండుటెండను సహితం లెక్క చేయకుండా వేచి ఉన్నారు. నడినెత్తిన చుర్రుమనిపిస్తున్న సూరీడు సహితం వారి అభిమానం ముందు చిన్నబోయాడు. వేలాదిగా తరలివచ్చిన జనంతో కోరుకొండ మొత్తం కిక్కిరిసిపోయింది. రోడ్లన్నీ వెల్లువలా తరలివచ్చిన జనంతో నిండిపోయాయి.
మరోవైపు జగన్ సోదరి షర్మిల కూడా జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజోలు నియోజకవర్గం మలికిపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలలో జరిగిన సభలు ఒకదానికొక టి పోటీ పడ్డాయి. ఆయా ప్రాంతాలు జనంతో కిటకిటలాడాయి. ఆమె రోడ్‌షోలు తిరునాళ్లను తలపించాయి. దారి పొడవునా బారులు తీరిన జనంతో రహదారులన్నీ జనదారులుగా మారిపోయాయి. పండగ వాతావరణాన్ని తలపించేవిధంగా సభలు, రోడ్‌షోలు సాగాయి. తమ ప్రాంతంలో అడుగు పెట్టిన దగ్గరి నుంచి సభా ప్రాంగణం వరకూ ఆమెను వేలాదిగా జనం తోడ్కొని వెళ్లారు. ఆద్యంతం వెంట పరుగులు తీశారు. షర్మిల హావభావాల్లో ఆమె తండ్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపించడంతో కేరింతలు కొట్టారు. తనపై అభిమానాన్ని కురిపించిన వారందరికీ ఆమె అభివాదం చేశారు.
చంద్రబాబువి మోసాలు, కుట్రలు : జగన్
చంద్రబాబు మోసాలు, కుట్రలను ప్రజలు గమనించాలని, రోజుకొక అంశం తెరపైకి తెచ్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్ని అప్రమత్తం చేశారు. కోరుకొండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. ‘‘మన ఎన్నికల ప్రణాళిక ఇచ్చిన కొన్ని గంటల తరువాత చంద్రబాబు 34 పేజీలతో ఒక కొత్త ఎన్నికల ప్రణాళిక ఇచ్చారు. అందులో 24 పేజీల్లో కొత్త వాగ్దానాలు చేశారు. దాదాపు 300 కొత్త వాగ్దానాలు చూపించారు. మీ అందరినీ నేను కోరేది ఒక్కటే.
చంద్రబాబు 2014లో ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో 50 పేజీల్లోని కొన్ని వాగ్దానాలను మీకు చదివి వినిపిస్తున్నాను. వ్యవసాయ రుణాలు మాఫీ.. రైతన్నలకు గిట్టుబాటు ధర కోసం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.. డ్వాక్రా రుణాల మాఫీ.. బెల్టు షాపుల రద్దు.. మహిళల భద్రతతకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ.. ఆపదలో ఉన్న మహిళలకు సెల్‌ఫోన్ ద్వారా ఐదు నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ.. యువతకు ఉద్యోగం, ఉపాధి, ఇంటికో ఉద్యోగం, ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి.. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్.. పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య.. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికీ సరఫరా.. అవినీతి రహిత సుపరిపాలన తదితర హామీలను ఆ మేనిఫెస్టోలో పెట్టారు. వీటిపై చంద్రబాబు సంతకం పెట్టారు. ఇవన్నీ అమలయ్యాయా లేదా అన్నది ప్రజలే చెప్పాలి. ఈయన మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెతికితే ఆ ఎన్నికల ప్రణాళిక కనిపించని పరిస్థితి. ప్రజలు నిలదీస్తారన్న భయంతో 2014 ఎన్నికల ప్రణాళిక కనబడకుండా మాయం చేశారు.
ఈ మాదిరిగా మోసం చేస్తూ 54 పేజీల ఎన్నికల ప్రణాళికను 2014లో ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ 34 పేజీల ఎన్ని కల ప్రణాళిక విడుదల చేశారు. ఇంతటి మోసగాడు మనకు కావాలా?’’ అని ప్రజలను కోరారు. ‘‘నెల రోజులుగా చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని మీరంతా చూశారు. ప్రతి రోజూ ఒక కుట్ర, ప్రతి రోజూ ఒక పుకారు మనం చూస్తున్నాం. ఎన్నికల రోజు వచ్చేటప్పటికి కుట్ర తీవ్రస్థాయిలోకి వెళ్లిపోతుంది. ప్రతి రోజూ టీవీల్లో, ఆయనకు అమ్ముడుపోయిన పేపర్లలో ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తున్నారు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
వెన్నుపోటు బాబు : షర్మిల
వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకాలకు మారుపేరు చంద్రబాబు అని షర్మిల ధ్వజమెత్తారు. మలికిపురం, కాకినాడ, ద్రాక్షారామల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె మాట్లాడారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన వెంటనే అదే తొలి సంతకమని చెప్పి తొలి సంతకానికే విలువ లేకుండా చేశారన్నారు. మహిళలకు మొత్తం డ్వాక్రా రుణాలు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా ఐదేళ్లు గడిపేశారన్నారు. ఇప్పుడేమో పసుపు – కుంకుమ అంటూ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నట్టు మూడు విడతలుగా చెక్కులు ఇచ్చి మహిళలను మరోసారి ఘోరంగా వంచించారన్నారు.
ఇసుక మాఫియాను ప్రశ్నించిన మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని దౌర్జన్యం చేస్తే.. ఆ వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్యేగా సీటు ఇచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తానంటూ దగా చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు పాలవగా, మరికొంతమంది చదువులు కూడా మానివేశారని, ఈ పాపం చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. ‘‘పేదవాడికి జబ్బు వస్తే గవర్నమెంట్ ఆస్పత్రికే వెళ్లాలి. చంద్రబాబుకో, ఆయన కుటుంబంలో వారికి జబ్బులు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారట. ఇది అమానుషం కాదా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా పుత్రవాత్సల్యంతో తన కొడుకు లోకేష్‌కు మూడు శాఖల మంత్రి పదవిని కట్టబెట్టారని షర్మిల దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment