జగన్‌కు జెడ్ కేటగిరి భద్రత తొలగింపు అన్యాయం
వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ధ్వజం
పాతగుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్ కేటగిరి భద్రతను తొలగించడం అన్యాయమని ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పలువురు ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను తొలగించిందని మండిపడ్డారు. తమ పార్టీ దీనిపై కోర్టును ఆశ్రయించిందని, తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేయడం పిరికిపందల చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారితే హత్యారాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు ఉండటం బాధగా ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు సునీత(ఫిరంగిపురం), నూర్ అఫ్తార్(నరసరావుపేట), జి.శిరీష(మాచర్ల), ఎ.సుధారాణి(చేబ్రోలు), సంతోషమ్మ(బొల్లాపల్లి), దాచేపల్లి ఎంపీటీసీ సభ్యుడు ఎం.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.