
రాజ్యసభలో దుమ్ముదుమారం.. జైట్లీకి కోపం
న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వెంటనే సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేశ్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేసి ఉన్నట్లయితే కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చేదని హెచ్చరించారు. గోవధ నిషేధం పేరిట ముస్లింలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయనే అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో నరేశ్ అగర్వాల్ జోక్యం చేసుకొని మాట్లాడుతూ మద్యం బ్రాండ్స్‌కు హిందూ దేవుళ్లు, దేవతలకు లింక్ పెడుతూ మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనతో క్షమాపణ చెప్పించేందుకు పట్టుబట్టాయి. అయితే, స్పీకర్ కురియన్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఓ ఎంపీకి తగదని మందలిస్తూ ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, పార్టీ నేతల ఒత్తిడితో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు నరేశ్ అగర్వాల్ చెప్పగానే వాటిని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అయితే, సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన అగర్వాల్ రాముడి పేరిట ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అనే విషయాన్ని సభకు చెప్పాలని ప్రయత్నించానని అన్నారు.