Naresh Agarwal
-
హిందూ దేవుళ్లను మద్యంతో పోల్చినా..
సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్‌వాది పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు నరేశ్ అగర్వాల్‌ను ఇటీవల భారతీయ జనతాపార్టీ చేర్చుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్కీలో విష్ణువు ఉన్నారు, రమ్‌లో శ్రీరామ్ ఉన్నారంటూ హిందూ దేవుళ్లను మద్యం బ్రాండ్లతో పోల్చడం, భారత సైన్యం సత్తాను ప్రశ్నించడం, పాక్‌లో ఉరి శిక్ష పడిన కులభూషణ్ జాదవ్‌ను టెర్రరిస్టుగా వర్ణించడం, సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్‌పై సెక్స్ కామెంట్లు చేయడం, ప్రధాని నరేంద్ర మోదీకి కులతత్వాన్ని ఆపాదించడం ద్వారా నరేశ్ అగర్వాల్ అత్యంత వివాదాస్పదుడయ్యారు. గోమాంసం, ట్రిపుల్ తలాక్ పట్ల బీజేపీ వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఆయన ఓ గ్యాంగ్ రేప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తాము తీసుకున్న అత్యంత దరిద్రమైన నిర్ణయమని ఏనాడైనా బీజేపీ ఒప్పుకుంటుందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ ఏమైనా వాషింగ్ మిషనా!, బీజేపీ భిన్నమైన పార్టీ అంటే అర్థం ఇదేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జీవితంలో తానెన్నడూ బీజేపీలో చేరనంటూ కూడా శపథం చేశారు. ఆయన ద్వంద్వ ప్రమాణాలు, వివాదాస్పద వ్యాఖ్యలను తెలుసుకోవాలంటే ‘ది లల్లాన్‌టాప్ డాట్ కామ్’కు 2017, ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూను చూడాల్సిందే. -
బీజేపీ ఎంపీకి జయాబచ్చన్ కౌంటర్
న్యూఢిల్లీ: మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ నరేష్ అగర్వాల్ తన మీద చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జయాబచ్చన్ స్సందించారు. సినీ నటిగా తాను ఎంతో గర్వపడుతున్నానని, చిత్ర పరిశ్రమలో సభ్యురాలు అయినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇతరులు తనపై చేసిన కామెంట్స్ పట్టించుకోనని జయాబచ్చన్ తెలిపారు. తనకు రాజ్యసభలో మరోసారి అవకాశం కల్పించిన సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని దానిలో భాగంగానే తనకు మరోసారి అవకాశం కల్పించారన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్త పరుచుకునే హక్కు ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికి లేదన్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ తనకు కాకుండా ఒక ఫిల్మ్ డ్యాన్సర్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిందంటూ జయాపై నరేష్ అగర్వాల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నరేష్ అగర్వాల్ జయాపై వ్యాఖ్యలు చేయడం ఇది ఐదోసారి. గతంలో కూడా తనపై నరేష్ అనేక వ్యాఖ్యలు చేశారని నేనేప్పుడు వాటిని సీనియస్‌గా తీసుకోలేదని తెలిపారు. మరోవైపు జయాపై చేసిన కామెంట్స్‌ను రాజ్యసభలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నరేష్ అగర్వాల్...తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ అన్నారు. -
జయపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు..!
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా బీజేపీలో చేరిన ఎస్పీ కురువృద్ధుడు నరేశ్ అగర్వాల్.. బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్‌ను ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తనను కాదని ఒక బాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చిందని జయాబచ్చన్‌ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఎస్పీ తనను అవమానించిందని పేర్కొన్నారు. పదవులు ఆశించి బీజేపీలోకి రాలేదని, ఏ బాధ్యత అప్పగించినా తాను నెరవేరుస్తానని నరేశ్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఆయన సోమవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కమలం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ‘బాలీవుడ్లో డ్యాన్ చేసే వ్యక్తి’కి టికెట్ ఇచ్చారని నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. నరేశ్ అగర్వాల్ సొంత పార్టీ బీజేపీలో చేరినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేశ్ అగర్వాల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ.. జయపై ఆయన వ్యాఖ్యలు అనుచితమని, ఆయన వ్యాఖ్యలను ఎంతమాత్రం ఆమోదనీయం కాదని ఆమె తేల్చిచెప్పారు. -
రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని.. బీజేపీలోకి జంప్!
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాంరాం చెప్పి సోమవారం బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి, పార్టీ నేత పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన సోమవారం కమలం కండువా కప్పుకున్నారు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిన నరేశ్ అగర్వాల్ పార్టీ మారారు. సమాజ్‌వాదీ పార్టీలో నరేశ్ అగర్వాల్ అత్యంత సీనియర్ నేత. ఆయన ఏడుసార్లు హర్దోయి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత కొన్నాళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నరేశ్ పార్టీని వీడటం.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
రాజ్యసభలో దుమ్ముదుమారం.. జైట్లీకి కోపం
న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వెంటనే సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేశ్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేసి ఉన్నట్లయితే కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చేదని హెచ్చరించారు. గోవధ నిషేధం పేరిట ముస్లింలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయనే అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో నరేశ్ అగర్వాల్ జోక్యం చేసుకొని మాట్లాడుతూ మద్యం బ్రాండ్స్‌కు హిందూ దేవుళ్లు, దేవతలకు లింక్ పెడుతూ మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో క్షమాపణ చెప్పించేందుకు పట్టుబట్టాయి. అయితే, స్పీకర్ కురియన్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఓ ఎంపీకి తగదని మందలిస్తూ ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, పార్టీ నేతల ఒత్తిడితో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు నరేశ్ అగర్వాల్ చెప్పగానే వాటిని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అయితే, సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన అగర్వాల్ రాముడి పేరిట ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అనే విషయాన్ని సభకు చెప్పాలని ప్రయత్నించానని అన్నారు. -
ప్రధానికే ప్రాణభయమా? మరి దేశం పరిస్థితి!!
-
ప్రధానికే ప్రాణభయమా? మరి దేశం పరిస్థితి!
క్యూ లైన్లలో నిలబడ్డ కోటీశ్వరులేరి? రాజ్యసభలో వాడీవేడి చర్చ న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రధాని మోదీ రాజ్యసభకు రావడంతో ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు మొదట మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు తనను కొంతమంది బతుకనివ్వకపోవచ్చునని, తనకు ప్రాణభయం ఉందని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని సమాజ్‌వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్ తప్పుబట్టారు. సాక్షాత్తూ ప్రధానికే ప్రాణభయం ఉంటే.. దేశాన్ని ఎవరూ కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలే కష్టాలు పడుతున్నారని, బ్యాంకుల ముందు క్యూలైన్లలో కోటీశ్వరులు ఎవరైనా నిలబడ్డరా కేంద్రాన్ని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో రెండో ఎమర్జెన్సీ విధించినట్టయిందని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి నివేదికలు అందాయని, కానీ ఆ తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసనని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో పెద్దనోట్ల రద్దులాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే లోక్‌సభ, రాజ్యసభ అనుమతి తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ఏసీబీలో విజయ్ మాల్యాలాంటి పెద్దలకు రూ. 7వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనాన్ని ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించారు. కనీసం ఆర్థకమంత్రి జైట్లీని సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా పెద్దనోట్ల రద్దును ప్రకటించారని విమర్శించారు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు పెడితే.. ప్రజలు మిమ్మల్ని నిషేధిస్తారని మోదీ సర్కార్‌ను హెచ్చరించారు. -
'కార్పొరేట్ గూఢచర్యం'పై చర్చిద్దాం
కార్పొరేట్ గూఢచర్యం కేసుకు సంబంధించిన విషయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సమాజ్‌వాది పార్టీకి చెందిన నరేశ్ అగర్వాల్ ఈ విషయంపై చర్చను లేవనెత్తారు. ముఖ్యమైన శాఖల(పెట్రోలియం, రక్షణ, విదేశీ)కు చెందిన విలువైన రహస్య పత్రాలు లీకయినప్పటికీ అందుకు కారణమైన ప్రధానమైన వ్యక్తులను వదిలేసి చిన్నచితకా, జూనియర్స్‌ను మాత్రమే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ కార్యదర్శి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకుని ఈ విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పెట్రోలియంశాఖతోపాటు రక్షణశాఖకు చెందిన పలు విలువైన పత్రాలు లీకైన విషయంపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. -
ఆర్డినెన్సు ఉండి తీరాల్సిందే: సమాజ్‌వాదీ
నేరచరితులైన ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రభుత్వం గతంలో ఆమోదించిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవద్దని ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సమాజవాదీ పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ఆర్డినెన్స్ విషయంలో సుప్రీం కోర్టు సూచనలను సమాజ్‌వాదీ పార్టీ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు నరేశ్ అగర్వాల్ తెలిపారు. యువరాజు రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేయగానే ఆ ఆర్డినెన్స్‌ను ఎలా ఉపసంహరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేసినంత మాత్రాన ఏకంగా ఆర్డినెన్స్ అపేస్తారా అంటూ నిలదీశారు. భారత్ ప్రభుత్వం కంటే రాహుల్ గొప్పవాడా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు చూస్తూంటే సర్కారు కంటే రాహుల్ గాంధీయే గొప్పవాడు అనే భావన యూపీఏ సర్కార్‌లో నెలకొన్నట్లు అనిపిస్తుందన్నారు. అయితే ఆ అర్డినెన్స్‌పై స్పందించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిరాకరించారు. దేశంలో అవినీతి అతిపెద్ద సమస్య అని, ప్రజలంతా పార్టీలకు అతీతంగా వచ్చి స్వచ్ఛమైన రాజకీయాలను ప్రోత్సహించాలని చెప్పారు. ఒకరివైపు ఒకరు వేలెత్తి చూపించుకోవడం సరికాదని, అవినీతిని తరిమికొట్టాల్సిందేనని బుధవారం లక్నోలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ మీడియాతో అన్నారు. -
ఏపి విభజన మంచిదికాదు: ఎస్పి
హైదరాబాద్: ఏపి విభజన మంచిదికాదని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నరేష్ అగర్వాల్ అన్నారు. రాజ్యసభలో ఈరోజు తెలంగాణపై జరిగిన సుదీర్ఘ చర్చలో ఆయన మాట్లాడారు. ఏ ప్రాతిపదికన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు గతంలో నెహ్రూ వ్యతిరేకించారు. ఇప్పుడు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? పరిపాలనా సౌలభ్యం కోసమైతే దేశాన్ని కూడా విభజిస్తారా? అని ఆయన అడిగారు. గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విభజించనున్నారన్నారు. తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాలను గెలవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం అని, అందు కోసమే రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించుకుందని నరేష్ అగర్వాల్ విమర్శించారు.