నేరచరితులైన ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రభుత్వం గతంలో ఆమోదించిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవద్దని ప్రధాని మన్మోహన్ సింగ్ను సమాజవాదీ పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ఆర్డినెన్స్ విషయంలో సుప్రీం కోర్టు సూచనలను సమాజ్వాదీ పార్టీ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు నరేశ్ అగర్వాల్ తెలిపారు. యువరాజు రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేయగానే ఆ ఆర్డినెన్స్ను ఎలా ఉపసంహరిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేసినంత మాత్రాన ఏకంగా ఆర్డినెన్స్ అపేస్తారా అంటూ నిలదీశారు. భారత్ ప్రభుత్వం కంటే రాహుల్ గొప్పవాడా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు చూస్తూంటే సర్కారు కంటే రాహుల్ గాంధీయే గొప్పవాడు అనే భావన యూపీఏ సర్కార్లో నెలకొన్నట్లు అనిపిస్తుందన్నారు. అయితే ఆ అర్డినెన్స్పై స్పందించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిరాకరించారు.
దేశంలో అవినీతి అతిపెద్ద సమస్య అని, ప్రజలంతా పార్టీలకు అతీతంగా వచ్చి స్వచ్ఛమైన రాజకీయాలను ప్రోత్సహించాలని చెప్పారు. ఒకరివైపు ఒకరు వేలెత్తి చూపించుకోవడం సరికాదని, అవినీతిని తరిమికొట్టాల్సిందేనని బుధవారం లక్నోలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ మీడియాతో అన్నారు.