
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాంరాం చెప్పి సోమవారం బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి, పార్టీ నేత పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన సోమవారం కమలం కండువా కప్పుకున్నారు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిన నరేశ్ అగర్వాల్ పార్టీ మారారు.
సమాజ్‌వాదీ పార్టీలో నరేశ్ అగర్వాల్ అత్యంత సీనియర్ నేత. ఆయన ఏడుసార్లు హర్దోయి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత కొన్నాళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నరేశ్ పార్టీని వీడటం.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.