కోలకతా: పశ్చిమ బెంగాల్‌లోని ఒక మిషనరీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో అమానుషం చోటు చేసుకుంది. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా లెగ్గింగ్స్ వేసుకున్నారనే సాకుతో మైనర్ బాలికల పట్ల పాఠశాల యాజమాన్యం అవమానకరంగా ప్రవర్తించింది. సోమవారం జరిగిన ఈ ఘటన బాలికల తల్లితండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..బెంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 4-9 సంవత్సరాల వయసున్న బాలికలు లెగ్గింగ్స్ వేసుకొని స్కూలుకు వచ్చారు. దీంతో పాఠశాల డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్లు మైనర్ బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉష్టోగ్రతలు పడిపోయి, చలికి వణికిపోతున్నారన్న కనీస మానవత్వం కూడా లేకుండా..పిల్లలతో బలవంతంగా లెగ్గింగ్స్‌ను తీసి వేయించారు. రోజంతా అలాగే వుండేలా శిక్ష విధించారు.
దీనిపై బాలికల తల్లదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరని అవమానకరమైన ఈ చర్య తమ మర్యాదకు భంగకరమని ఆవేదన చెందారు. అభశుభం తెలియని తమ ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడుతూ శాంతినికేతన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన బిడ్డ లెగ్గింగ్ లేకుండా పాఠశాల నుండి బయటకు రావడం చూసి షాకయ్యాననీ, పాపకు లోదుస్తులు కూడా లేవని బాధిత బాలిక తండ్రి ఒకరు వాపోయారు. ఇది చాలా దారుణమని పేర్కొన్న ఆయన హెడ్‌మిస్ట్రెస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బాధితుల ఫిర్యాదును స్వీకరించి, తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అభిషేక్ రాయ్ అన్నారు. పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నామన్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించామంటూ తమ చర్యను సమర్ధించుకున్నారు. అయినా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పామనీ, ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కాలేదనీ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ అర్చన ఫెర్నాండెజ్ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ అనన్య చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సంఘటన దారుణమైందని వ్యాఖ్యానించారు. విచారణ చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment