జై భవానీ.. జైజై భవానీ
- వైభవంగా ప్రారంభమైన భవానీ దీక్షల స్వీకరణ
- భారీగా తరలివచ్చిన భవానీలు
సాక్షి, విజయవాడ : జై భవానీ.. జైజై భవానీ అనే నామస్మరణతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం మార్మోగిపోయింది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం భవానీదీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు భవానీదీక్ష మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించిన అనంతరం మండపారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అఖండదీప ప్రజ్వలన నిర్వహించారు. ఆలయ ఈవో వి.త్రినాథరావు విఘ్నేశ్వర పూజ నిర్వహించిన అనంతరం భక్తులకు దీక్ష మాలలు వేయడం ప్రారంభించారు.
వేలాదిగా వచ్చిన దీక్షాధారులు
భవానీదీక్షల స్వీకరణ సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సుమారు ఐదువేల మంది దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో, గురుస్వాముల ఆధ్వర్యంలో వేలాదిమంది దీక్షలు స్వీకరించారు. అనంతరం దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భవానీ దీక్షల వాల్ పోస్టర్‌ను ఈవో వి.త్రినాథరావు, ఆలయ స్థానాచార్య వి.శివప్రసాద్ ఆవిష్కరించారు.