జైలే.. మేలు
సరైన వసతులు, భోజనాల లేవు
ఏళ్లు గడుస్తున్నా ఇక్కడే ఉన్నాం
తిరుపతి క్రైం: తెలిసో తెలియకో చిన్న చిన్న నేరాలకు పాల్పడిన చిన్నారులు ఏళ్ల తరబడి జువైనల్ హోమ్‌లో మగ్గుతున్నారు. ఎంత మంది మేజిస్ట్రేట్‌లు వచ్చినా వారికి విముక్తి కలగడంలేదు. మంగళవారం జువైనల్ హోంలోని బాలురు సాక్షితో వారి ధీనగాథ విని పించారు. వారి దుస్థితి వారి మాటల్లోనే.. మొత్తం 22 మంది ఉన్నాం. సరైన వసతులు లేవు. రూములు సరిపోవడం లేదు. బాత్‌రూంలు సరిగా కడగడం లేదు. నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి. 3 ఫ్యాన్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇది ఒక్క ఎత్తై నిత్యం మా దగ్గర పాచి పనులు కూడా చేయిస్తున్నారు.
కనీసం తల్లిదండ్రులతో మాట్లాడుదాం అన్నా ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఈ బాలుర వసతి గృహం కంటే జైలే మేలేమో. మా సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాథులే లేరు. జువైనల్ హోం అధికారులే మాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. చట్ట ప్రకారం ఏ బాలుడైనా జువైనల్ హోంలో రెండేళ్లు మాత్రమే ఉంటారు. మేము మాత్రం 2 ఏళ్లు దాటినా ఇక్కడే ఉన్నాం. ఎప్పుడైనా తల్లిదండ్రులను చూద్దాం అన్నా వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నాం. ఇన్ని లోపాలు ఉన్న ఈ వసతి గృహంలో బతకడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాం.
ఇప్పడికి కూడా ఇది మారక పోతే ఎప్పటికైనా మేము ఆత్మహత్య చేసుకుంటాం. ఎవరైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మాపాలిట దేవుళ్లులా మా జీవితంలో వెలుగు నింపేలా మా సమస్యలు పరిష్కరించేలా ఉండాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ విషయమై జువైనల్ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా అరకొర వసతులు ఏమీ లేవని, సిబ్బంది మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నారని తెలిపారు. ఎవరికీ బెయిల్ రాకుండా అడ్డుకోలేదని, అలా చేయాల్సి అవసరం మాకెందుకు వచ్చిందన్నారు. వారు బాగుపడాలన్నదే మాకు కావాల్సిందన్నారు.