తిరుపతి: వ్యభిచారం కేసులో మాజీ మహిళా ప్రొఫెసర్తో పాటు ఆమె సహాయకుడికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 22 వేలు జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కోర్టు సమర్థించింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ మహిళ... తిరుపతిలో సులువుగా బతకొచ్చంటూ నమ్మబలికి ఓ బాలికను, యువతిని రేణిగుంటకు తీసుకువచ్చింది. అక్కడ బీటీఆర్ కాలనీకి చెందిన సి.తేజ అలియాస్ శ్రీకాంత్‌కు వారిని అప్పగించింది. శ్రీకాంత్ వారిని బెదిరించి వ్యభిచారం కూపంలోకి దింపాడు. కొన్నాళ్ల తర్వాత వారిని ఎస్వీ యూనివర్సిటీ వయోజన విద్యా విభాగం ప్రొఫెసర్ పి.వసంతకుమారి ఇంటికి పంపి అక్కడ వ్యభిచారం చేయించాడు.ఈ క్రమంలో ఓ యువతి తిరుపతి వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2005 ఆగస్టు 2వ తేదీ వెస్టు స్టేషన్ పోలీసు అధికారులు డీఎస్పీ అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని మహిళా ప్రొఫెసర్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ మరికొందరు యువతులు ఉన్నట్టు గుర్తించారు. నిందితురాలు వసంతకుమారి సహా 16 మందిపై వ్యభిచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు వసంతకుమారి, ఆమె సహాయకుడు శ్రీకాంత్‌కు మాత్రం శిక్ష విధిస్తూ 2007 ఆగస్టు 21న తీర్పు చెప్పింది. శిక్షపడిన ఇద్దరు వేర్వేరుగా తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. దీనిపై న్యాయమూర్తి కింది కోర్టు తీర్పును అమలు చేయాలని సూచించింది.