ఒంగోలు : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కలెక్టర్ విజయకుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజనను స్థానిక రంగాభవన్‌లో గురువారం సాయంత్రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ఎంతో గొప్ప పథకమని, దాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఖాతాదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పథకం ద్వారా లబ్ధిచేకూరుస్తూ విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో 9 లక్షల కుటుంబాలున్నాయని, వాటిలో పింఛన్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఫీజురీయింబర్స్‌మెంట్, గ్యాస్ కనెక్షన్లు తదితర పథకాలతో పాటు ఇతర అవసరాలకు ప్రారంభించిన బ్యాంక్ ఖాతాలు 10 లక్షలకుపైగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఒక్కో కుటుంబానికి రెండు అకౌంట్ల చొప్పున కనీసం మరో 4 లక్షల అకౌంట్లు తప్పనిసరని తెలిపారు. ఈ లక్ష్యాన్ని ఆరునెలల్లో పూర్తిచేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో జిల్లాను ఉంచాలని బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ కేవలం బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం కాకుండా, ప్రజలంతా వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు.
ప్రధానమంత్రి జన్-ధన్ యోజన మంచి పథకమంటూ.. దాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అనంతరం కొత్తగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించిన వారికి పాస్‌బుక్‌లు, కార్డులు అందించారు. కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం జ్యోతి శ్రీనివాస్, జేసీ యాకూబ్‌నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహారావు, సిండికేట్ బ్యాంక్ డీజీఎం నరసింహారావు, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, మెప్మా పీడీ కమలకుమారి, ఎస్‌బీఐ ఏజీఎం ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
‘జన్-ధన్’ పథకం ప్రారంభం
Published Fri, Aug 29 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement