Jan-Dhan Yojana
-
సోషల్ మీడియా సూపర్‌స్టార్
ప్రసార - ప్రచార మాధ్యమాలు (చానళ్లు - పేపర్లు) రాజకీయ నాయకుల ప్రచారాలకు బాగానే ఉపయోగపడుతున్నా అలాంటి ప్రచారంతో పాటు ఆయా నాయకుల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేందుకు సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) అద్భుతమైన సాధనం. అందులోనూ ట్విట్టర్ వంటివి నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ సోషల్ మీడియాను ఆయన ఉపయోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోలేదనడం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించబట్టే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు ప్రకటించాలన్నా ఆయన దాన్నే సాధనంగా చేసుకుంటున్నారు. తద్వారా వాటికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నారు. స్వీయ ప్రచారానికి, విధానపరమైన నిర్ణయాల ప్రచారానికి మాత్రమే కాదు... దేశాలతో దౌత్య సంబంధాలకు కూడా ఆయన ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా సాధనాల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆయన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా పాపులర్ అయ్యారు. ఈ ఏడాది కూడా టైమ్ మ్యాగజీన్ ‘30 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులు’ జాబితాలో మోదీకి స్థానం లభించింది. ట్విట్టర్లో ఆయనను 2.2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో 3.4 కోట్ల మంది మోదీని లైక్ చేశారు. ఇంటర్నెట్, చానళ్ల విస్తృత వినియోగంతో మరుగున పడిపోతున్న ఆకాశవాణి (రేడియో)కు కూడా సోషల్‌మీడియాలో చోటు కల్పించిన ఘనత మోదీదే. రేడియోలో ‘మన్ కీ బాత్’ పేరుతో మోదీ ప్రసంగాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. కీలకమైన విధాననిర్ణయాలను ప్రకటించడానికి ‘మన్ కీ బాత్’ను ఉపయోగిస్తుండడంతో అందరూ దానిపై కేంద్రీకరించాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఖాతాలను తానే స్వయం గా నిర్వహిస్తున్నారా అన్నట్లుగా ఉంటాయి మోది పోస్టింగ్‌లు, మెస్సేజ్‌లు. ‘ఈ ఫొటో నేనే తీశాను...’ ‘ఈ సంఘటన నన్నెంతగానో కదిలించింది..’ అంటూ ఆయన స్వయంగా చేస్తున్న ట్వీట్ల వల్లే నెటిజన్లు ఆయనకు బాగా చేరువవుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే మోదీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నంతగా బీజేపీ ఉపయోగించుకోలేకపోతోంది. ముఖ్యంగా ఆ పార్టీకున్న 282 మంది ఎంపీలలో మెజారిటీ భాగం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని కార్యాలయం ఇటీవలే ఈ గణాంకాలన్నీ తీసింది. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మోదీ వెంటనే ఎంపీలందరికీ ఓ లేఖరాశారు. ఒక్కో ఎంపీ కనీసం లక్ష మంది ఫాలోవర్లు, లక్ష లైక్‌లు సంపాదించేలా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో యాక్టివ్ కావాలని ఆయన ఆ లేఖలో కోరారు. తీరు మార్చిన నిర్ణయాలు *ఈ ఎన్డీయే కేబినెట్లో గత యూపీఏ ప్రభుత్వంలో కన్నా 35% తక్కువగా మంత్రివర్గ సభ్యులున్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన దిశగా మంత్రివర్గ కూర్పులో కీలక మార్పులు చేపట్టారు. తద్వారా ఆమేరకు ఖజానాపై భారం తగ్గించారు. *జనాభాలో 65% ఉన్న యువత శ్రమ శక్తిని ఉపయోగించుకోవడానికి.. నైపుణ్యాభివృద్ధి పెంపు కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. *పాక్‌తో సత్సంబంధాలను కోరుకుంటునే.. ఉగ్రవాదంపై పాక్ రెండు నాల్కల ధోరణిని ప్రతీ సందర్భంలో ఎత్తి చూపుతూనే ఉన్నారు. *ప్రణాళిక సంఘం ప్రస్తుత అవసరాలకు సరిపోదని భావించి, ‘నీతి ఆయోగ్’ను తెరపైకి తెచ్చారు. *యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలకు.. అవినీతి రహిత పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చారు. రెండేళ్ల పాలనలో నీతిమంత పాలన అందించేందుకు కృషి చేశారు. మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రులు 1. సుష్మాస్వరాజ్ (విదేశాంగ శాఖ) 2. రాజ్‌నాథ్ సింగ్ (హోం శాఖ) 3. అరుణ్ జైట్లీ (ఆర్థిక శాఖ) 4. వెంకయ్యనాయుడు (పట్టణాభివృద్ధి శాఖ) 5. మనోహర్ పరీకర్ (రక్షణ శాఖ) 6. సురేశ్ ప్రభు (రైల్వే శాఖ) 7. నితిన్ గడ్కరీ (రోడ్డురవాణా, నౌకాయాన శాఖ) వ్యవసాయం గుడ్డిలో మెల్ల మన దేశం ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ వ్యవసాయ రంగం. స్థూల దేశీయోత్పత్తికి 14 శాతం అందిస్తున్న ప్రాధాన్య రంగం ఇది. దేశ జనాభాలో 55 శాతం మంది (సుమారు 60 కోట్ల మంది) వ్యవసాయం, అనుబంధ వ్యాపకాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అన్నదాతా సుఖీభవా అన్న భావన అనాదిగా ఉన్నప్పటికీ ఆరుగాలం చమటోర్చి పంటలు పండిస్తూ సమాజానికి అన్నం పెడుతున్న రైతుకు మాత్రం సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం అంతకంతకూ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ పాలన గుడ్డిలో మెల్ల అని చెప్పాలి. వ్యవసాయ రంగ సంక్షోభం పరిష్కారానికి ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు చేస్తామని రెండేళ్ల క్రితం బీజేపీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అయితే, అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. అయితే, వ్యవసాయ సంక్షోభాన్ని ఉపశమింపజేసే దిశగా గత రెండేళ్లుగా ఆచితూచి అడుగులు వేస్తున్నది. స్వామినాథన్ సిఫారసు చేసిన విధంగా ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించడం కాదు గానీ.. 2022 నాటికి రైతులకు ఆదాయ భద్రత కల్పిస్తామని నమ్మబలుకుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్లలో ఈ- వేలం సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నది. ఈ చర్య వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి దోహదపడుతుందని మోదీ చెబుతున్నారు. అయితే, ఈ-వేలం సదుపాయాన్ని ఉపయోగించుకునేలా రైతులకు సాంకేతిక సహాయం అందించాల్సి ఉంది. అకాల వర్షాలు, కరువు కాటకాల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వం మెరుగైన పంటల బీమా పథకాన్ని (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియం, ఎక్కువ మంది రైతులకు బీమా సదుపాయం కల్పించడం, కోత అనంతర నష్టాలకూ బీమాను వర్తింపజేయడం, అన్నిటికీ మించి.. మండలాన్ని, గ్రామాన్ని కాకుండా రైతు పొలాన్ని యూనిట్‌గా పరిగణించి నష్టాన్ని అంచనావేసే వెసులుబాటు కల్పించారు. సాగు నీటి వనరుల అభివృద్ధికి ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన ద్వారా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి.. బిందు, తుంపర సేద్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నారు. నీమ్ కోటెడ్ యూరియాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నది. వాతావరణం, వ్యవసాయ, మార్కెట్ సమాచారాన్ని అందించేందుకు కిసాన్ ఛానల్‌ను ప్రారంభించింది. -
జన్‌ధన్‌కు జై..
సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. దేశంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందిస్తామంటూ ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదమిదీ! ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ నినాదాన్ని నిజం చేసేందుకు ఆయన అనేక ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టారు. స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలతో పాటు బాలికల కోసం భేటీ బచావ్, భేటీ పడావ్, మహిళల సాధికారత కోసం ముద్ర యోజన, ఎస్సీ/ఎస్టీ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండప్ ఇండియా.. ఇలా దాదాపు 40 పథకాలు ప్రవేశపెట్టారు. అయితే ఇందులో స్వచ్ఛ భారత్, జన్‌ధన్ యోజన పథకాలే ప్రజాదరణ పొందాయి. ఇటీవల సీఎంఎస్ సర్వేలో కూడా ఇదే తేలింది. ఇబ్బడిముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిలో(40 పథకాల్లో) 25 పథకాల గురించి తెలిసినవారు కేవలం 3 శాతమే ఉన్నారు. 25 శాతం మందికి ఏడు పథకాలు మాత్రమే తెలుసు. మోదీ ఇప్పటిదాకా ప్రవేశపెట్టిన పథకాలు, వాటి తీరుతెన్నులను ఓసారి చూద్దాం..- సెంట్రల్‌డెస్క్ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ఒకటి. దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడడం ఈ పథకం లక్ష్యం. జీరో బ్యాలెన్స్‌తో ఏ ప్రభుత్వ బ్యాంకులోనైనా ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించే ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28న మోదీ ప్రారంభించారు. పథకం ప్రారంభించిన ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 15.59 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయి. ఇది గిన్నిస్ రికార్డు. ఇప్పటివరకు ఈ పథకం కింద 21.81 కోట్ల ఖాతాలున్నాయి. వాటిలో ఖాతాదారులు రూ.37,445 కోట్లు జమ చేసుకున్నారు. రూపాయి కార్డు ద్వారా 17 కోట్ల ఖాతాలిచ్చారు. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 61 శాతం మందికి బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. వారిలో 52 శాతం మహిళలే ఉండడం విశేషం. స్వచ్ఛ భారత్ అభియాన్ పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ 2014 అక్టోబర్ 2న(గాంధీ జయంతి) రోజున ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఈ పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. దీంతో పారిశుధ్యంపై ప్రజల్లో గతంలో కంటే అవగాహన కాస్త పెరిగింది. 1986లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కేంద్ర గ్రామీణ పారిశుధ్య పథకాన్ని ప్రారంభించారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూడా సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇవేవీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్(ఎస్బీఏ) పథకం మాత్రం గణనీయమైన పురోగతి కనబరిచింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం, రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్ల చెత్తాచెదారం తొలగించడం, ప్రజాక్షేత్రాల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ఉద్దేశం. 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మరుగుదొడ్లు(9 కోట్ల టాయిలెట్లు) నిర్మించడం పథకం లక్ష్యం. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాం చివర్లో (2013-14లో) 49,76,294 టాయిలెట్లను నిర్మిస్తే.. మోదీ ప్రభుత్వం 2014-15లో 58,55,666 టాయిలెట్లను నిర్మించింది. మొత్తంమీద ఇప్పటిదాకా ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే కొత్తగా 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ఎస్బీఏ కింద 2.61 లక్షల ప్రభుత్వ బడుల్లో 4.17 లక్షల మరుగుదొడ్లు నిర్మించారు. ఇదీ ప్రగతి గ్రామీణ ప్రాంతాల్లో.. *నిర్మించిన మరుగుదొడ్ల్లు - 2.07 కోట్లు *బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలికినవి - 14 జిల్లాలు, 190 బ్లాకులు, 23 వేల గ్రామ పంచాయతీలు, 56 వేల గ్రామాలు. పట్టణ ప్రాంతాల్లో.. *నివాసాల్లో మరుగుదొడ్ల నిర్మాణం -15.10 లక్షలు *ఈ ఏడాది డిసెంబర్‌కల్లా బహిరంగ విసర్జన రహిత నగరాలు(లక్ష్యం)- 400 నగరాలు ఆధార్, డీబీటీతో అక్రమాలకు చెక్ ఆధార్‌కు చట్టబద్ధత... మోదీ సర్కారు తీసుకున్న మరో కీలక నిర్ణయం! దీనిద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే అందడమే కాకుండా నగదు పక్కదారి పట్టడం చాలావరకు తగ్గిపోయింది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్ చట్టబద్ధత ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్), ఎల్పీజీ, ఉపాధి హామీ పథకాల్లో అక్రమాలకు చెక్ పడింది. ఆధార్, డీబీటీ ద్వారా ఎల్పీజీలో 3.5 కోట్ల బోగస్ కనెక్షన్లను గుర్తించి తొలగించారు. దీంతో 2014-15లో రూ.14 వేల కోట్ల సొమ్ము ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది. మేకిన్ ఇండియా పరిశ్రమలు భారత్‌లోనే తమ ఉత్పత్తులను తయారుచేసేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2014 సెప్టెంబర్ 25న ప్రధాని దీన్ని ప్రారంభించారు. మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిచోటా ‘మేకిన్ ఇండియా’లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం కింద ఆటోమొబైల్స్, కెమికల్స్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, పోర్టులు, రైల్వేలు, విమానయానం, పర్యాటకం, డిజైన్, మైనింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి 25 ప్రధాన రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదీ ప్రగతి.. *దేశంలో 2013-14లో -0.1 శాతంగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి 2014-15 నాటికి 2.8 శాతం మేర పెరిగింది. *ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గిపోతున్నా భారత్‌లో మాత్రం పెరిగాయి. *భారత్‌లో పెరిగిన ఎఫ్‌డీఐల శాతం-48 *పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశాల జాబితాలో భారత్ కిందటేడాది మొదటి స్థానంలో నిలిచింది. స్కిల్ ఇండియా ప్రపంచానికి భారత్ ‘మానవ వనరుల’ రాజధానిగా అవతరించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, తద్వారా పేదరికాన్ని తరిమివేయడం ఈ పథకం ఉద్దేశం. 2022నాటికి దేశంలో 40 కోట్ల మందికి వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించాలన్నది పథకం లక్ష్యం. ఇదీ ప్రగతి.. *ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటివరకు 19.55 లక్షల మంది యువతకు శిక్షణ అందించారు. *దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన ద్వారా 21 నగరాల్లో 1100 శిక్షణ కేంద్రాల ద్వారా 3.56 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో 1.88 లక్షల మందికి ఉపాధి లభించింది. *దేశంలో కొత్తగా 1,141 ఐటీఐలను నెలకొల్పి 1.73 లక్షల సీట్లను అందుబాటులోకి తెచ్చారు. *స్కిల్ లోన్ పథకం పేరిట బ్యాంకుల ద్వారా రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల రుణం అందిస్తున్నారు. ‘బీమా’ రక్షణ జనాన్ని బీమా ఛత్రం కిందకు తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం 2015 మే 9న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తెచ్చింది. సంవత్సరానికి కేవలం రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ఈ బీమా రక్షణ కల్పిస్తోంది. ప్రమాదవశాత్తూ మరణించినవారికి రూ.2 లక్షలు, ప్రమాదంలో అవయవాలు కోల్పోయినవారికి రూ.1 లక్ష అందిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.330 ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. పెన్షన్ సదుపాయాన్ని కల్పిచేందుకు అటల్ పెన్షన్ యోజన స్కీంను కూడా తెచ్చారు. ఇదీ ప్రగతి.. * సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారి సంఖ్య 9.4 కోట్లు * జీవన్‌జ్యోతి పథకంలో చేరిన వారి సంఖ్య 3 కోట్లు * అటల్ పెన్షన్ యోజనలో చేరినవారు 20 లక్షలు -
‘జన్-ధన్’ పథకం ప్రారంభం
ఒంగోలు : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కలెక్టర్ విజయకుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజనను స్థానిక రంగాభవన్‌లో గురువారం సాయంత్రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ఎంతో గొప్ప పథకమని, దాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఖాతాదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పథకం ద్వారా లబ్ధిచేకూరుస్తూ విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో 9 లక్షల కుటుంబాలున్నాయని, వాటిలో పింఛన్లు, ఎన్ఆర్ఈజీఎస్, ఫీజురీయింబర్స్‌మెంట్, గ్యాస్ కనెక్షన్లు తదితర పథకాలతో పాటు ఇతర అవసరాలకు ప్రారంభించిన బ్యాంక్ ఖాతాలు 10 లక్షలకుపైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి రెండు అకౌంట్ల చొప్పున కనీసం మరో 4 లక్షల అకౌంట్లు తప్పనిసరని తెలిపారు. ఈ లక్ష్యాన్ని ఆరునెలల్లో పూర్తిచేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో జిల్లాను ఉంచాలని బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ కేవలం బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం కాకుండా, ప్రజలంతా వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. ప్రధానమంత్రి జన్-ధన్ యోజన మంచి పథకమంటూ.. దాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అనంతరం కొత్తగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించిన వారికి పాస్‌బుక్‌లు, కార్డులు అందించారు. కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం జ్యోతి శ్రీనివాస్, జేసీ యాకూబ్‌నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహారావు, సిండికేట్ బ్యాంక్ డీజీఎం నరసింహారావు, డీఆర్డీఏ పీడీ పద్మజ, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, మెప్మా పీడీ కమలకుమారి, ఎస్బీఐ ఏజీఎం ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేది నేడే
ఖమ్మం గాంధీచౌక్: బ్యాంకుల్లో ప్రతి వ్యక్తికీ ఖాతాలు తెరిచేలా గురువారం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ‘జన్-ధన్ యోజన’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ ఎస్.వి.వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావటం కోసం దీన్ని ఏర్పాటు చేశారన్నారు. ‘మేరా ఖాతా భాగ్య విధాత’ అనే నినాదంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. గురువారం ఒక్క రోజునే దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి బ్యాంక్ ఖాతాలు తెరవాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఖాతాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ‘రూపే’ డెబిట్ కార్డు ఇస్తారని తెలిపారు. దీనిలో భాగంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలను ప్రారంభించుకునే అవకాశాన్ని కూడా కల్పించారని చెప్పారు. రూపే కార్డు ద్వారా ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. రూపే కార్డున్న వారికి రూ. లక్ష బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. వరంగల్ జోన్ పరిధిలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 14 వేల నూతన ఖాతాలను తెరవాలని నిర్ణయించామన్నారు. ఖమ్మం జిల్లాలోని 35, వరంగల్ జిల్లాలోని 36 బ్రాంచీల పరిధిలో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామసభలు కూడా నిర్వహించి ఖాతాలను తెరుస్తామని తెలిపారు. బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వాలు నిర్వహించే పలు పథకాలను అనుసంధానం చేస్తారని తెలిపారు. ఆయా పథకాల ఫలాలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని తెలిపారు. ఆంధ్రాబ్యాంక్‌తో పాటు అన్ని బ్యాంక్‌లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. 2014 మార్చి 31 వరకు చెల్లించాల్సిన పంట రుణాలు, వ్యవసాయం నిమిత్తం బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని, ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు మాఫీ వస్తుందని వరంగల్ జోన్ ఆంధ్రాబ్యాంక్ జోనల్ ఆఫీసర్ సి. ధనుంజయ అన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు అర్హత ప్రకారం రైతుల ఖాతాలకు ఈ మొత్తం జమవుతుందన్నారు. పంట రుణాలు ఒక లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలుగా పొందవచ్చు అని చెప్పారు. రూ.లక్ష నుండి 3 లక్షల వరకు పావులా వడ్డీకి పొందవచ్చునని తెలిపారు. రుణాలు పొందితే వివిధ పంటలకు అమల్లో ఉన్న పంట బీమా పథకం వర్తిస్తుందని కూడా అన్నారు. ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 15 వరకు పంటల బీమా పథకం పొడిగించబడిందని చెప్పారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.