సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణరెడ్డి
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి సాధ్యమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పి.లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న చర్యలు అమోఘమని కొనియాడారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు చరిత్రలో లిఖించదగ్గదని కొనియాడారు. నెల రోజుల వ్యవధిలో దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారన్నారు. రాజధానిగా అమరావతి అంత శ్రేయస్కరం కాదని మేధావులు, విద్యావేత్తలు, కమిటీలు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆక్షేపించారు. మూడు పంటలు పండే ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్‌గా చంద్రబాబు ప్రభుత్వం మార్చిందని విమర్శించారు.
రాష్ట్రానికి మధ్యలో ఉందని అమరావతిని రాజధాని చేయడం సరికాదన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ఆరోపించారు. అదీ కూడా ఒక సామాజిక వర్గం కోసమే చంద్రబాబు అక్కడ రాజధాని ప్రకటించారని దుయ్యబట్టారు. అభివృద్ధి కాని ప్రాంతంలో లక్షల కోట్లు వెచ్చించి రాజధాని నిర్మించే కన్నా.. వనరులన్నీ సమృద్ధిగా ఉన్న విశాఖపట్నంలో ఐదారు వేల కోట్లతో హైదరాబాద్, ముంబయి తలదన్నిన రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని భావించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా మారాలంటే సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు వెచ్చించాలన్నారు. రాష్ట్ర సమతుల్యాభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడకుండా వికేంద్రీకరణను స్వాగతించాలని ఆయన హితవు పలికారు.
అంబేడ్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ లజపతిరాయ్ మాట్లాడుతూ వికేంద్రీకరణపై ప్రజల్లో చైతన్యం బాగా వచ్చిందన్నారు. వికేంద్రీకరణ అనేది ఇప్పటిది కాదని 1953లోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా మిగిలిపోయాయన్నారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు, కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి చైర్మన్ పేర్ల సాంబమూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక విశాఖ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పౌర గ్రంథాలయంలో నేడు సదస్సు
వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి అనే అంశంపై సోమవారం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో సదస్సు నిర్వహించనున్నట్టు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి.లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 నుంచి నిర్వహించనున్న సదస్సుకు ప్రొఫెసర్ కేసీ రెడ్డి, ప్రొఫెసర్ కేఎస్ చలం, ప్రొఫెసర్ బాల మోహన్‌దాస్, పలువురు మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment