రాజకీయ పార్టీగా జనసేనకు ఈసీ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ ఇప్పుడు రాజకీయ పార్టీగా మారింది. జనసేన రిజిస్టర్డ్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి గుర్తింపు పొందినట్లు ఆ పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్-29(ఏ) ప్రకారం ఈసీ నవంబర్ 28న జనసేనకు రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు (కామన్ సింబల్) మీద పోటీ చేసేందుకు కూడా జనసేనకు అవకాశం ఉన్నట్లు ఈసీ పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పార్టీ దరఖాస్తు చేసింది’ అని జనసేన ఆ ప్రకటనలో తెలిపింది. గత ఎన్నికల్లో ప్రచారానికే పరిమితమైన పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధమైంది.