నేడు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన
-
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక
-
పార్టీ పేరు, ఎజెండా వెల్లడించనున్న పవర్ స్టార్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘జన సేన’ పేరుతో ఏర్పాటు చేయబోయే పార్టీని ప్రకటించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైటెక్స్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కాబోతుంది. సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ మాదాపూర్ డీసీపీకి ఆయన సన్నిహితులు శ్రేయా మీడియా ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేశారు.
శుక్రవారం జరగనున్న సమావేశంలో పార్టీ పేరు, ఎజెండా, లక్ష్యాలను ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమస్యల నడుమ సగటు మధ్యతరగతి మనిషి నానా ఇక్కట్లకు గురవుతున్న ప్రస్తుత తరుణంలో అంకిత భావంతో కూడిన సేవలు అందించాలన్న ఆశయంతో పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని ఆయన సన్నిహితవర్గాలు గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో వివరించాయి.
45 నిమిషాలపాటు ప్రసంగం..
‘జన సేన’ లక్ష్యాన్ని ప్రకటించడానికి కన్వెన్షన్ సెంటర్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నిహితులు, అభిమానులు మొత్తంగా ఐదు వేల మంది కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ బార్ కోడ్ కలిగిన పాసులను జారీ చేశారు. పాసులపై పార్టీ లోగోను ముద్రించారు. ఆ బార్ కోడ్ ప్రకారం వారికి కేటాయించిన సీటులో మాత్రమే కూర్చోవాలని నిబంధన పెట్టారు. సాయంత్రం 6.30 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశపు వేదికపై నుంచి 45 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. తాను మాట్లాడుతున్నప్పుడు అటుఇటుగా నడవడానికి వీలుగా వేదిక ముందు 16 అడుగుల మేరకు ఒక ర్యాంప్ కూడా నిర్మించారు.
ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ ఆనంద్‌సాయి రూపొందించిన పార్టీ జెండాను, లోగో (షడ్చక్రం)లను పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు. స్టిల్ ఫోటోలు తీసుకునేందుకు ఫోటోగ్రాఫర్లకు 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జన సేన ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తిలకించడానికి అభిమాన సంఘాల ద్వారా రాష్ట్రంలోని 28 పట్టణాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఏడు థియేటర్లతో పాటు, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, జమ్మికుంట, బెల్లంపల్లి, మహబూబ్‌నగర్, సీమాంధ్రలో 14 ప్రధాన పట్టణాలతోపాటు బెంగళూర్‌లోని థియేటర్లలో దీన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
అన్నయ్యతోనే అభిమానులుంటారు: నాగబాబు
మెగా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అన్నయ్య చిరంజీవితోనే అభిమానులందరూ ఉంటారని ఆయన సోదరుడు నాగబాబు గురువారం ప్రకటించారు. పవన్ మరోసారి రాజకీయ తెరమీదకు రావడానికి 24 గంటల ముందు నాగబాబు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.