పవన్ పార్టీ ‘జన సేన’?
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు పవన్ కల్యాణ్ కొత్త రాజకీయ పార్టీ పెడతారా? లేదా? అనే అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. పార్టీ విషయంలో పవన్ కల్యాణ్ నుంచిగానీ ఆయన సన్నిహితుల నుంచిగానీ ఇప్పటివరకు ఒక్కమాట బయటకు రాకపోయినప్పటికీ ఇందుకు సంబంధించిన ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖరారైందని ఆయన అభిమాన సంఘం నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు గత పక్షం రోజులుగా ప్రచారం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ స్థాపించబోయే పార్టీ పేరు ‘జన సేన’ అని గత రెండురోజుల నుంచి సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో కన్పిస్తోంది. మరోవైపు పార్టీ పెట్టాలా? లేక ప్రస్తుతానికి ఆ ఆలోచన పక్కనపెట్టి వచ్చే ఎన్నికలకు అవసరమైన పూర్వరంగం సిద్ధం చేసుకోవాలా? అన్న అంశంపై ఈ నెల 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటుచేసే సభలో మాట్లాడేందుకు పవన్‌కల్యాణ్ సిద్ధమవుతున్నారనీ చెబుతున్నారు. పవన్ తన జెండా, ఎజెండా గురించి చెప్పడానికి నిర్వహించే ఈ సమావేశం కోసం ఆయన అభిమానులు హైదరాబాద్ తరలివస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
ఇదే సమయంలో ‘కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయడమన్నది ఇప్పుడున్న తక్కువ సమయంలో సాధ్యం కాదు. ఎన్నికల షెడ్యూలు కూడా ప్రకటించిన నేపథ్యంలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌కు ఉన్న గడువు సరిపోదు. ఇప్పటికే ఎవరైనా రిజిస్టర్ చేసిన పార్టీని తీసుకుని దానిద్వారా మాత్రమే తెరమీదకు రావడానికి ఉంది. అందువల్ల ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒక్కరే లోక్‌సభకు పోటీ చేసి 2019 ఎన్నికల నాటికి పూర్తిస్థాయి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలి..’ అనే ఆలోచనపైనా తర్జనభర్జనలు జరుగుతున్నట్టుగా కూడా ప్రచారంలో ఉంది.
‘ప్రస్తుతం కాకినాడ, మల్కాజ్‌గిరిలో ఏదో ఒక లోక్‌సభ స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చే స్తారు. ఇప్పటికిప్పుడు పార్టీ పేరు ప్రకటించే అవకాశం లేనందున ‘జనసేన’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ తరువాత ఆ పేరునే రాజకీయ పార్టీకి నామకరణం చేయాలని పవన్ ఆలోచన చేస్తున్నారు..’ అని ఆయన అభిమానుల్లో ప్రచారం జరుగుతోంది. తెల్లటి వస్త్రంపై ఎర్రటి విప్లవ చిహ్నం తన ప్రచార జెండాగా పవన్ ఖరారు చేశారని ఆయన అభిమానులుగా పేర్కొనేవారు చెబుతున్నారు.