
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై పలుమార్లు మాట మార్చి ప్రజలను మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధిస్తూ బుధవారం లక్ష్మణరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి, ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు నిరాహార దీక్షకు పూనుకోవాలని డిమాండ్ చేశారు.
జన చైతన్య వేదిక అడిగిన ప్రశ్నలు.. ప్రత్యేక హోదా కోసం ఏపీ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాత కూడా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? ప్రత్యేక హోదా సాధించిన 11 రాష్ట్రాలలో అసలేమాత్రం అభివృధ్ధి జరగలేదని ఆనాడు ఎందుకన్నారు? ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ లభించిందని ప్రజలను ఎందుకు మోసం చేశారు? ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై పి.డి యాక్ట్ ఉపయెగిస్తామని బెదిరించటం న్యాయమా? స్వచ్ఛందంగా ప్రజలు హోదా కోసం పోరాడుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసమే నిరాహార దీక్షకు పూనుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ చంద్రబాబు నాయడుకు పలు ప్రశ్నలతో కూడిన ప్రెస్‌నోట్‌ను జన చైతన్య వేదిక విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment