జన్మభూమి రచ్చరచ్చ
► వెల్లువెత్తుతున్న నిరసనలు
► పింఛన్ల రద్దుపై లబ్ధిదారుల ఆగ్రహం
► ఎమ్మెల్యేలు, అధికారుల నిలదీత
విశాఖ రూరల్ : జన్మభూమి-మా ఊరు కార్యక్రమం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సమావేశాలు నిర్వహిస్తున్న చోటాల్లా జనం నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయి. దీంతో అధికారులు హడలిపోతున్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కోసం రైతులు, మహిళలు.. పింఛన్ల రద్దుపై లబ్ధిదారులు.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై గ్రామస్తులు.. ప్రజాప్రతినిధులపైనే కాకుండా అధికారులపై కూడా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు బూటకపు హామీలపై నిలదీస్తున్న వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. సమస్యలు లేవనెత్తిన వారిని సముదాయించడం మినహా వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ప్రసంగాలతోనే సరి
జన్మభూమి కార్యక్రమాలు రాజకీయ సభలను తలపిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు కొంత మంది అధికారులు సైతం ప్రభుత్వం, చంధ్రబాబును స్తుతించడానికి అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించడం, గంటల తరబడి ప్రసంగాలు చేయడంతో వృద్ధులు, మహిళలు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి పడిపోయిన సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కానీ ప్రజాప్రతినిధుల తీరులో మార్పు రావడం లేదు. ఎండలోనే సమావేశాలు నిర్వహిస్తూ, అక్కడికి వచ్చిన ప్రజలకు కనీసం మంచినీటిని కూడా అందించడం లేదు. ఎమ్మెల్యేలు అసలు సమస్యలు వినడానికే ఆసక్తి చూపించడం లేదు. కేవలం రాజకీయ ప్రసంగం చేసి ఎటువంటి వినతులు స్వీకరించకుండానే వెళ్లిపోతున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
21వ వార్డులో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల రద్దుపై వృద్ధులు అధికారులను నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లిగణేష్‌కుమార్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని వాగ్వాదానికి దిగారు. దీంతో వాటిని మరోసారి పరిశీలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వృద్ధులు శాంతించారు.
కంచరపాలెం దుర్గానగర్ దుర్గాలయం వద్ద జరిగిన జన్మభూమి కార్యక్రమం నిరసనలతో హోరెత్తింది. సభ ప్రారంభంలోనే డ్వాక్రా, రైతు రుణాల మాఫీ చేయాలని, రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులు సక్రమంగా పంపిణీ చేయాలని సీపీఎం కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అర్హులైన వృద్ధాప్య, వితంతు, వికలాంగుల ఫించన్లు తొలగించడం అన్యాయమని మాజీ కార్పొరేటర్, సీపీఎం నాయకురాలు బొట్టా ఈశ్వరమ్మ సభా వేదిక వద్ద బైఠాయించారు. వారిని అదుపు చేయాలని పోలీసులు ప్రయత్నించగా వేదిక వద్దే ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులను గంటల తరబడి ఎండలో నిలబెట్టి ఉపన్యాసాలు ఇవ్వడంతో ఎండ తీవ్రతకు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు.