అనంతపురం జిల్లా రాయదుర్గం 12వ వార్డుకు చెందిన బీఆర్ దుర్గయ్యకు గతంలో పింఛన్ వచ్చేది. ఆయన 2015 జనవరి 10న మరణించటంతో డెత్ సర్టిఫికెట్‌తోపాటు తన ఆధార్, రేషన్‌కార్డు జతచేస్తూ దుర్గయ్య భార్య లక్ష్మి పింఛన్ కోసం దరఖాస్తు చేసు కుంది. 38 నెలలుగా పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోవడంతో అధికారులకు మొరపెట్టుకుంది. అయితే ఆమెకు పింఛన్ వస్తోందని వారు వెల్లడిం చటంతో బండారం బయటప డింది. 38 నెలలుగా ఆమెకు పింఛన్ ఇస్తున్నట్లు రికార్డుల్లో నమోదైంది. పింఛన్ కాజేసిన విషయం బట్టబయలు కావటంతో చివరకు రూ.10 వేలు ఇచ్చి మొత్తం ఇచ్చినట్లు సంతకం చేయించుకున్నారు.
సాక్షి, అమరావతి: రెక్కాడితేకానీ డొక్కాడని వెంకాయమ్మ భర్తను కోల్పోయి 68 ఏళ్ల వయసులో కూలి పనికి వెళ్లి పొట్ట పోసుకుంటోంది. దివ్యాం గుడైన కుమారుడిని పోషించే భారం కూడా ఆమెపైనే పడింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవటం, కుటుంబ పోషణ భారం కావటంతో పింఛన్ కోసం ఇప్పటివరకు 20 సార్లు దరఖాస్తు చేసుకున్నా సర్కారు కనికరించలేదు. ఆమె కుటుంబం వైఎస్సార్ సీపీకి మద్దతు ఇస్తోందనే కక్షతో దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయి. ఈ దీనావస్థ కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామానికి చెందిన బలంతు వెంకాయమ్మ ఒక్కరిదే కాదు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు పొందేవారందరికీ ఇలాంటి నిస్సహాయ పరిస్థితులే నెలకొన్నాయి.
పింఛన్ పంపిణీ ప్రాంతాల్లో కమిటీల తిష్ట..
ఏ ఆసరా లేక ప్రభుత్వం నుంచి ప్రతి నెలా అందే పింఛనుపైనే ఆధారపడి బతికే పేదలను జన్మభూమి కమిటీలు, అధికార పార్టీ నేతలు డబ్బుల కోసం పీక్కు తింటున్నాయి. జన్మభూమి కమిటీలు పింఛన్‌దారుల నుంచి ప్రతి నెలా దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు లంచాల రూపంలో గుంజుతున్నాయి. జన్మభూమి కమిటీ సభ్యులు ఒకటో తేదీ నుంచి ఐదారు తేదీల మధ్య గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసే ప్రాంతాల్లో తిష్టవేసి ఒక్కో లబ్ధిదారుడి నుంచి వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వీరిని చూసి పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
నెలనెలా మామూళ్లు ఇవ్వకుంటే ఏరివేత..
2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే జన్మభూమి కమిటీలను నియమించాకే ఈ అరాచకాలకు తెరలేచింది. కమిటీ సభ్యులకు నెలనెలా లంచాలు ఇవ్వకుంటే పింఛన్లు తొలగిస్తారనే భయంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో పేదలు మామూళ్లు సమర్పించుకుంటున్నారు. దీర్ఘకాలంగా పింఛన్ పొందుతున్న వారిని సైతం అర్హులా? కాదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు టీడీపీ సర్కారు ప్రతి గ్రామంలో ఏడుగురు సభ్యులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏకంగా జీవో 135 తెచ్చింది. ఈ ఏడుగురిలో నలుగురు టీడీపీ వారే కావటం గమనార్హం. ఈ జీవో వచ్చాక ఒకే నెలలో ఏకంగా నాలుగు లక్షల మందికిపైగా పింఛన్లకు కోత పడింది.
మళ్లీ ఇవ్వాలన్నా డబ్బులిస్తేనే..
ఒకవేళ ఎవరైనా లబ్ధిదారుడు కూలి పనులు తదితర కారణలతో వేరే ప్రాంతానికి వలస వెళ్లి రెండు మూడు నెలలపాటు పింఛను తీసుకోని పక్షంలో తాత్కాలికంగా తొలగించడం ప్రారంభించారు. మళ్లీ పింఛను మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కమిటీలకు అసాధారణ అధికారాలు కట్టబెట్టడంతో పేదలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు.
లంచం ఇస్తేనే పింఛన్..
పింఛన్లు పొందుతున్న ప్రతి ముగ్గురులో ఒకరు నెలనెలా లంచాలు ఇచ్చుకోక తప్పుడంలేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఈమేరకు ఇటీవల నవంబరు 1 – 6వ తేదీల మధ్య నిర్వహించిన అభిప్రాయ సేకరణలో జన్మభూమి కమిటీ సభ్యులు లంచాలు అడుగుతున్నారని 28.39 శాతం మంది వెల్లడించారు. అక్టోబరులో ఇది 28.17 శాతంగా ఉంది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ లంచం అడుగుతున్నట్లు 23 శాతం మంది తెలిపారు. పింఛను ఇచ్చే సమయంలో లంచం అడుగుతున్నారని చెబుతున్న వారి సంఖ్య ప్రతి నెలా 23–29 శాతం మధ్య ఉంటోంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి నెలా 10 లక్షల మంది నుంచి 14 లక్షల మంది దాకా లంచాల బారిన పడుతుండొచ్చని అధికారుల అంచనా. ఇలా ఒకొక్కరి నుంచి రూ.వంద చొప్పున వసూలు చేసే మొత్తం ప్రతి నెలా రూ.10 కోట్ల నుంచి 14 కోట్ల వరకు ఉంటోంది.
చర్యలకు జంకుతున్న సర్కారు
పింఛన్‌దారుల నుంచి జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతి నెలా కోట్ల రూపాయలు లంచంగా వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. గ్రామాల్లో టీడీపీ పెద్దలు పిలుపునిచ్చే కార్యక్రమాలన్నీ జన్మభూమి కమిటీ సభ్యుల చేతుల మీదుగా జరుగుతుండడంతో చర్యలు తీసుకోవడానికి జంకుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment