
జన్మభూమి కమిటీలతో అర్హులకు అన్యాయం
కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధ్యక్షతన శనివారం స్థానిక కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జన్మభూమి కమిటీల ద్వారా జరుగుతున్న అవినీతి, నష్టాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీల పేరుతో ఈ ప్రభుత్వం పేదల కడుపుకొడుతోందని, అర్హులకు కాకుండా అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ, కమిషనర్ సంతకాలు లేకపోయినా జన్మభూమి కమిటీ సభ్యుల సంతకాలుంటే చాలు అధికారులు కళ్లుమూసుకొని పింఛన్లు మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ కాశినాయన మండలం నాయనిపల్లెలో తమ కాళ్లు పట్టుకుంటేనే పింఛన్ ఇప్పిస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు అంటున్నారని సభ దృష్టికి తీసుకు వచ్చారు.
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో కూడా జన్మభూమి కమిటీల సిఫార్సులు అమలు చేయడం సరికాదన్నారు. తప్పుచేస్తే సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తున్నారని, అధికారులను సస్పెండ్ చేస్తున్నారని, అనర్హులను సిఫార్సు చేసిన జన్మభూమి కమిటీలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని, కమిటీలు సిఫార్సు చేసిన అనర్హుల పింఛన్లు ఒక్కటైనా రద్దు చేశారా? అంత ధైర్యం అధికారులకు ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. పోరుమామిళ్ల ఎంపీపీ విజయప్రతాప్ మాట్లాడుతూ అధికారులు రూపొందించిన అర్హుల జాబితా కాకుండా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే పింఛన్లు ఇస్తున్నారని, ప్రజలకు తాము ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఒక దశలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు మ్యాండేటరీ(తప్పనిసరి)కాదని కలెక్టర్ చెప్పడంతో గందరగోళం నెలకొంది. అలాగైతే జన్మభూమి కమిటీ సభ్యులతోనే సమావేశం నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులెవరో రాతమూలకంగా రాసిస్తే విచారణ చేసి తొలగిస్తామని కలెక్టర్ ఇచ్చిన సమాధానంతో ఎమ్మెల్యేలు సంతృప్తి చెందలేదు. అనర్హులను సిఫారసు చేసిన కమిటీలపై ఏం చర్యలు తీసుకొంటారని గట్టిగా పట్టుబట్టారు. అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సూటిగా సమాధానమివ్వలేదు. ఆ కమిటీలు ఏర్పాటుచేసింది ఇన్‌చార్జి మంత్రే కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోతామని కలెక్టర్ చెప్పడంతో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఎజెండాకు.. మినిట్స్‌కు సంబంధమేమిటి..?
అంతకుముందు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రెండవ సమావేశానికి సంబంధించి మినిట్స్‌లో తన సంతకం లేకుండానే ప్రభుత్వానికి పంపారని, ఎమ్మెల్యేలు లేవనె త్తిన ఏ ఒక్క అంశం కూడా మినిట్స్‌లో రాలేదన్నారు. ఈసారి తన కు చూపిన తర్వాత ప్రభుత్వానికి పంపితే బాగుంటుందని కన్వీనర్ అయిన కలెక్టర్‌కు సూచించారు. దీనిపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ తాము మాట్లాడిన విషయాలు మినిట్స్‌లోకి రాకపోతే ఈ మీటింగ్‌కు తాము రావడమెందుకని ప్రశ్నించారు. ఛెర్మైన్‌కు చూపిన తర్వాతే సభ్యులందరికీ మినిట్స్ కాపీలు పంపాలన్నారు. దీనిపై కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ ఎజెండా పరిధిలోకి రాని వాటిని రికార్డు చేయలేదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, వారిచ్చే సూచనల ప్రకారం మినిట్స్ ఛెర్మైన్‌కు పంపుతామని చెప్పారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎజెండాలోని అంశాలే మాట్లాడాలని గిరిగీసుకొని కూర్చొంటే కుదరదని, అర్థవంతమైన సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలకు ముందు ఢంకా బజాయించి చెప్పారని, నేడు ఫీల్డ్ అసిస్టెంట్లను అకారణంగా తొలగిస్తున్నారని చెప్పారు. ఇందుకు డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం సమాధానమిస్తూ 75 శాతం కంటే తక్కువ పనులు చేసిన వారిని మాత్రమే తొలగిస్తున్నామని తెలిపారు.
కమలాపురంలో రూ. 56 కోట్ల పనులు జరగ్గా, ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చేసుకున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఒక్క పనికి రెండుసార్లు బిల్లులు చేసుకోవడం చాలా సీరియస్ అంశమని, ఈ విషయంపై తనకు ఆధారాలు ఇస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇసుక క్వారీలు రద్దు చేయాలి
జమ్మలమడుగులో ఏర్పాటు చేస్తున్న ఇసుక క్వారీని రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోరారు. ఈ ఇసుక క్వారీని రద్దు చేయాలని స్థానిక సంస్థలు తీర్మానాలు ఇచ్చాయని, అయినా అధికారులు ముందుకు పోవడం భావ్యం కాదని చెప్పారు. ఖాజీపేట వద్ద ఇసుక క్వారీని రద్దు చేయాలని రఘురామిరెడ్డి కోరగా, పొన్నుతోట, అనిమెల, రాజుపాలెం, కుమ్మరాంపల్లె ఇసుక క్వారీలను రద్దు చేయాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఇక్కడ ఇసుక క్వారీలు ఏర్పాటు చేస్తే తాగునీటి స్కీములు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసిందని, ఇందులో భాగంగా జిల్లాకు రూ. 50 కోట్లు వచ్చాయని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీకి సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కానందున స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని నియోజకవర్గాలకు సమంగా ఈ నిధులను పంపిణీ చేసేలా తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఇందుకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మద్దతు ప్రకటించారు.
ద్వంద్వ విధానాలు ఎందుకు?
ఎంపీ నిధుల మంజూరులో ఆలస్యం జరుగుతోందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్‌బి అంజద్‌బాషా, పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ నిధుల విషయంలో లక్ష దాటితే టెండర్ పిలవాలంటున్నారు, ఇదే నియమాన్ని నీరు-చెట్టులో ఎందుకు అమలు చేయరని ధ్వజమెత్తారు. నీరు-చెట్టు కార్యక్రమంలో రూ. 50లక్ష ల విలువగల పనులు కూడా నామినేషన్‌పై ఇస్తున్నారని, ఇంత అవినీతి జరుగుతున్నా ఎజెండాలో లేదని తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. కమలాపురం, సీకేదిన్నె, చదిపిరాళ్ల, పాతకడప చెరువుల్లో జరిగిన పనులపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంపీ ల్యాడ్స్ నిధుల విషయమై పది రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
క్యాన్సర్ కంటే ఇది ప్రమాదకరం- ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
జన్మభూమి కమిటీల వల్ల ఏ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, అనేక అవకతవకలన్నీ ఈ కమిటీల వల్లే జరుగుతున్నాయని జిల్లా విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ ఛెర్మైన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది క్యాన్సర్ కంటే ప్రమాదకరమన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు స్థానిక సంస్థలను బలహీనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కమిటీల వల్ల ఏ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడంలేదన్నారు. పింఛన్లు అర్హులైన వారికి కాకుండా అనర్హులకు అందుతున్నాయని, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో కూడా ఈ కమిటీలదే పెత్తనంగా ఉందన్నారు. ఫలితంగా అవినీతికి ఆస్కారమేర్పడుతోందని, దీనిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. తాగునీటి పథకాలు, ఐఏవై పథకాలలో ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు పనులు చేయాలని కోరామన్నారు. ఎన్‌ఎస్‌ఏపీ, ఉపాధిహామీ పథకం వంటి కేంద్రప్రభుత్వ పథకాలకు కూడా జన్మభూమి కమిటీలతో ముడిపెట్టి నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో రామాపురం, వేముల మండలాలు మినహా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, ఈ మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని కోరామన్నారు.