జపాన్‌తోనైనా అభివృద్ధి మొదలయ్యేనా?
పర్యటనతోనే సరిపెట్టిన జైకా బృందం
రెండుసార్లు మార్కెట్‌లో పర్యటించిన ప్రతినిధులు
ఆగస్టు వచ్చినా నిధులు మాత్రం రాలేదు
మదనపల్లె: అగ్రగామిగా ఉన్న జపాన్ దేశం చూపు మదనపల్లె మార్కెట్ వైపు పడింది. అయితే నిధుల ఊసే లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనే టమాటా క్రయవిక్రయాలలో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన మదనపల్లె టమాటా మార్కెట్ అభివృద్ధికి జపాన్ ప్రభుత్వం తొలిఅడుగులు వేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జనవరి 19, మార్చి 5వ తేదీలలో విడివిడిగా ఆ దేశ ప్రతినిధులు మదనపల్లెకు వచ్చి మార్కెట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. ప్రపంచంలోని దేశాల్లో చైనా తరువాత, ఎక్కువగా టమాటా పండించే దేశంగా గుర్తింపు పొందిన మనదేశంలో 68 శాతం దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంలోని మదనపల్లె ప్రాంతంపై జపాన్ దేశం కన్నుపడడం గమనార్హం. ఇక్కడి టమాటా సాగు, క్రయ, విక్రయాలపై పరిశోధన చేసేందుకు ఆ దేశం తరఫున బెంగళూరులోని జైకా( జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ) ప్రతినిధులు బృందం జరిపిన పర్యటనలో వారు పూర్తి సంతృప్తి పొందారు.
జైకా ప్రతినిధులు ప్రకాష్, ప్రకాష్ పి.దేశాయ్ తొలిగా జనవరి 19వ తేదీన రాగా, రెండోసారి మార్చి 5వ తేదీన యోకియో ఐకెడ, యోషికో హోండాలు మార్కెట్ యార్డులోని వివిధ అంశాలను పరిశీలించారు. తొలుత మార్కెట్‌లో టమాటాలను విక్రయానికి తెచ్చిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. టమాటా దిగుబడి, రాబడి గురించి వాకబు చేశారు. రైతులు చెప్పిన అనేక అంశాలకు సంతృప్తిని వ్యక్తం చేసిన ప్రతినిధులు నివేదికలలో రైతుల అభిప్రాయాలకే పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చారు. అయితే ఆగస్టు వచ్చినా నిధులు రాకపోవడంతో మార్కెట్ అభివృద్ధిపై సందేహం కలుగుతోంది.