క్షమించు వినాయకం ! | Jawan vinayakam anniversary tomorrow | Sakshi
Sakshi News home page

క్షమించు వినాయకం !

Published Tue, Jun 24 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

క్షమించు వినాయకం !

క్షమించు వినాయకం !

  • జవాన్ వినాయకం వర్ధంతి రేపు       
  •  బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించిన ఆయా ప్రభుత్వాలు        
  •  చిల్లిగవ్వ చెల్లించని ఏపీ సర్కారు
  •  
    వినాయకన్. ఏడాది కిందట కేదార్‌నాథ్  పర్యటనకు వెళ్లి విపత్తులో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు వెళుతూ  హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబానికి అండగా ఉంటామని అప్పటి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నేత (ప్రస్తుత ముఖ్యమంత్రి ) భరోసా ఇచ్చారు.  కానీ  దురదృష్టం. చనిపోయిన జవాన్లలో వినాయకన్ కుటుంబానికి మన ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు.        
     సాక్షి, చిత్తూరు: వినాయకం! దేశం కోసం.. దేశ ప్రజల కోసం నువ్వు ప్రాణాలర్పించి రేపటికి (బుధవారం) ఏడాది అవుతుంది. నాకు బాగా గుర్తింది. ఏడాది కిందట దేవభూమి ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర విపత్తు దేశాన్ని కకావికలం చేసింది. ఆ ఘటన తలుచుకుంటేనే భయమేస్తుంది.

    భర్తలను కోల్పోయిన భార్యలు.. బిడ్డలను పోగొట్టుకున్న తండ్రులు ఎంతో వేదన పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే గత ఏడాది కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లిన ప్రతీ మదీ.. ఆవేదనల న దిగా నేటికీ గత చేదుజ్ఞాపకాలు మొదలుతూనే ఉన్నాయి. అలాంటి విపత్తులో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు నీవంతు ప్రయత్నం చేశావు. ఎంతోమందిని కాపాడావు. నది ఇటువైపు నుంచి అటువైపునకు వెళ్లేందుకు దారి లేకపోతే రోప్‌లు వేసి వాటిపై వంతెనగా నీతో పాటు కొందరు జవాన్లు పడుకుని బాధితులను మీ వీపుపై నడిపించారు. ప్రాణాలు కాపాడారు.

    ఈ సంఘటన తెలిసి.. నువ్వు నా కడుపున పుట్టినందుకు చాలా గర్వపడ్డాను. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందావని తెలిసి బోరున విలపించాను. ‘‘మన వినాయకం.. పూతలపట్టు మండలం చిన్నబండపల్లె వాసి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో పని చేస్తున్నాడు. ఐదేళ్లు దేశానికి సేవచేశాడు. 26 ఏళ్లకే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయాడు.’’ అని జిల్లా ప్రజలు మొత్తం రోదించారు. నీ మృతదే హాన్ని ఆర్మీ అధికారులు గుర్తుపట్టలేకపోయారు. డీఎన్‌ఏ పరీక్ష చేసి శవాన్ని గత ఏడాది జూలై 3న స్వగ్రామానికి తెచ్చారు. మీ అమ్మానాన్నలు రాణెమ్మ, కృష్ణస్వామి ఎంత బాధపడ్డారో నాకు తెలుసు!

    రెన్నళ్లలో పెళ్లి. పెళ్లి కోసం కొత్త ఇళ్లు నిర్మించుకున్నారు. బిడ్డ వస్తాడు! మిగిలిన ఇంటి పని పూర్తి చేయిస్తాడని నీ రాకకోసం ఎదురుచూశారు. కానీ గుర్తుపట్టలేనంతగా శవమై ఇంటికొచ్చిన నిన్ను చూసి ఇంటిల్లిపాది గుండెలవిసేలా రోదించారు. ప్రభుత్వ లాంఛనాలతో నీ అంత్యక్రియలు జరిపారు. సంతోషించాను. అంత్యక్రియలపై చూపిన గౌరవం నీ కుటుంబాన్ని ఆదుకోవడంపై కూడా చూపిస్తారని భావించాను. అప్పటి మాజీ, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీ ఇంటికొచ్చారు.

    మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం కూడా అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ఇంటిస్థలం.. ఐదెకరాల పొలం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇలాంటి హామీలే నీతో పాటు మృతి చెందిన మరో ఎనిమిది మంది జవాన్లకు వారి ప్రభుత్వాలు ఇచ్చాయి. వారంతా ఇచ్చిన హామీలను ఎప్పుడో నెరవేర్చి జవాన్ల కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా నీ కుటుంబంతో పాటు తక్కిన తొమ్మిది మంది కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించిం ది.

    పక్కనే ఉన్న తమిళనాడులో చనిపోయిన నీ సహచర జవాన్‌కు అక్కడి ప్రభుత్వం స్థలం, పొలంతో పాటు రూ. 25 లక్షల పరిహారం ఇచ్చింది. కానీ దురదృష్టం. చనిపోయిన జవాన్లలో నీ ఒక్కడికే మన ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. స్థలం.. పొలం.. ఉద్యోగం అన్నీ మరిచిపోయింది. చేతికొచ్చిన కొడుకును కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా నీ తల్లిదండ్రులు ఏడాదిగా క్షోభను అనుభవిస్తున్నారు.

    ప్రభుత్వం.. ప్రభుత్వ యంత్రాంగం ఏ ఒక్కరూ నువ్వు చనిపోయావని.. ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చామని.. వాటిని నెరవేర్చి దేశం కోసం ప్రాణాలర్పించిన నీ కుటుంబానికి అండగా ఉండాలని బహుశా భావించలేదేమో! అందుకే హామీలను నెరవేర్చలేదేమో! రేపటితో నువ్వు నాకు దూరమై ఏడాది. అందుకే ఒక్కసారి నిన్ను నేను గుర్తుకు చేసుకుని.. హామీలను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా. ఏదిఏమైనా నీ కుటుంబానికి ఏడాదిగా అన్యాయం జరిగింది వినాయకం. క్షమించు వినాయకం!                                  

    ఇట్లు..నీ కన్నభూమి
    చిత్తూరు జిల్లా

     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement