
జెడ్పీ సీఈఓగా జయరామిరెడ్డి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా ఎం.జయరామిరెడ్డి ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఈఓగా పనిచేసిన ఎ.సూర్యప్రకాష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి పీఎస్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో జయరామిరెడ్డి నియమితులయ్యారు.
జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆమోదంతో ఆయన సూర్యప్రకాష్ చేతుల మీదుగా స్వీకరించారు. జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన జయరామిరెడ్డి 1979లో టైపిస్టుగా పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1985లో యూడీసీ, 1996లో ఈవోఆర్‌డీ, 1999 నుంచి ఎంపీడీఓగా పని చేస్తూ 2013లో ఇన్‌చార్జి డిప్యూటీ సీఈఓ స్థాయికి చేరుకున్నారు.
సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు, ఎంపీడీఓలు, జెడ్పీ ఉద్యోగులందరి సహకారంతో జెడ్పీని ప్రగతి పథంలో నడిపిస్తానన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. జయరామిరెడ్డికి జెడ్పీ గణాంకాధికారి టి.భాస్కర్‌నాయుడు, కార్యాలయ సూపరెంటెండెంట్లు దస్తగిరిబాబు, క్రిష్ణమూర్తి, నరసింహమూర్తి, జ్యోతి, ఆనందకుమారి, వెంకటేశ్వరరావు, నూర్జహాన్, రాణెమ్మ, సురేష్, హక్, భరత్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
సీఈఓ పదవి సంతృప్తినిచ్చింది: ఎ.సూర్యప్రకాష్
జెడ్పీ సీఈఓగా పని చేయడం సంతృప్తినిచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి పీఎస్‌గా బదిలీ అయిన సీఈఓ ఎ.సూర్యప్రకాష్ అన్నారు. ఆదివారం ఆయన జయరామిరెడ్డికి బాధ్యతలు అప్పగించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యతో పాటు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోని సమస్యలను అధిక శాతం పరిష్కరించామన్నారు. వివిధ సమస్యలతో జిల్లా పరిషత్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలను నిరాశ పరచకుండా న్యాయం చేకూర్చామన్నారు. విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ఎంపీడీఓలు, మినిస్టీరియల్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ అధికారులను ఎప్పటికీ మరువలేనని తెలిపారు.