అవన్నీ ఊహాగానాలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి 'పార్టీ మారుతారు...రాజకీయాలకు దూరంగా ఉంటార'న్న ఊహాగానాలకు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తెర దించారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ దివాకర్ రెడ్డి పార్టీ మారుతారన్న వార్తలను కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకే జేసీ నిర్ణయం తీసుకుంటారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
కాగా వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో కాంగ్రెస్ మరో 20 ఏళ్ల వరకూ కోలుకునే పరిస్థితి లేదన్నారు. తాము స్వతంత్రంగా పోటీ చేసినా గెలిచే సత్తా తమకు ఉందని, ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో గెలిచి తీరుతామని ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఇక జేసీ దివాకర్ రెడ్డి...తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు ఊపుందుకున్న విషయం తెలిసిందే.