సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 24న ర్యాంకులను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వాటిని వాయిదా వేసింది. ఈనె 25వ తేదీ వరకు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియట్, 12వ తరగతి బోర్డులు విద్యార్థులు ఇంటర్మీడియట్/12వ తరగతి ఫలితాల సమాచారాన్ని (డాటా) అందజేయాలని బుధవారం ప్రకటన జారీ చేసింది. 25వ తేదీలోగా ఫలితాల సమాచారం ఇవ్వని బోర్డులకు చెందిన విద్యార్థులకు ర్యాంకులు ఇవ్వడం కుదరదని, ఇందుకు తాము బాధ్యులం కాబోమని స్పష్టం చేసింది. తాజా ప్రకటన నేపథ్యంలో అల్ ఇండియా ర్యాంకులు ఈనెల 26 లేదా 27న వెల్లడించే అవకాశం ఉంది.