'తిరుమల ఆలయం మూసేయలేదు'
తిరుమల: భారీ వర్షాలతో శ్రీవారి ఆలయం మూసి వేసినట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని జేఈవో నివాసరాజు తెలిపారు. 20 రోజులు కింద 5 శాతం ఉన్న నీరు వర్షాలతో ఇప్పుడు 100 శాతానికి చేరిందన్నారు. ఏటా కురవాల్సిన 136 సెంటీమీటర్ల వర్షపాతం కంటే ఈ ఏడు ఇప్పటివరకు మొత్తం 193 సెంటీమీటర్లు కురిసిందన్నారు. నవంబరు మాసంలో ఇప్పటి వరకు మొత్తం 139 సెంటీమీటర్లు కురిసిందని, దీనివల్ల అన్ని జలాశయాలు నిండాయని తెలిపారు.
శ్రీవారి ఆలయంలో చిన్నపాటి నీరు నిలిచినా వాటిని తక్షణం తొలగించే యంత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాలకు రెండోఘాట్‌లో మట్టి కరిగిపోవడంతో రాళ్లు కూలిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రేయింబవళ్లు మరమ్మతులు చేస్తోందని అన్నారు. రెండు రోజుల్లో ఘాట్ రోడ్డులో మరమ్మతులు పూర్తి చేసి వాహనాలను అనుమతిస్తామని నివాసరాజు చెప్పారు.