
జ్యూయలరీ షాపులో భారీ చోరీ
అచ్చంపేట :అచ్చంపేట నడిబొడ్డు, 24 గంటలూ ఇసుక లారీల రాకపోకలతో రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి విగ్రహ సెంటర్‌లోగల గంగాభవానీ జ్యూయలరీ షాపులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కొందరు దుండగులు షాపు పైకప్పునకు కన్నం వేసి మూడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు దోచుకుపోయారు. జ్యూయలరీ షాపులో సీసీ కెమెరాలు కూడా లేవు.
పోలీసు అధికారులు సంఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మండలంలో సంచలనం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రోజూలాగే షాపును నిర్వహించి అనంతరం తాళాలు వేసి యజమాని మణికంఠ ఇంటికి వెళ్లారు.
యధావిధిగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన ఆయన షాపు షట్టర్ తాళాలు తీసి లోపలికి వెళ్లాడు. షో కేసుల్లో బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు రూరల్ సీసీఎస్ అదనపు ఎస్పీ శోభామంజరి, సత్తెనపల్లి డీఎస్పీ ఎన్‌ఆర్ వెంకటేశ్వరనాయక్, క్రైం డీఎస్పీ శ్రీనివాసరావు, సత్తెనపల్లి టౌన్ సీఐ శోభన్‌బాబు, సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు.
గుంటూరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. షాపు వెనుకభాగాన సీలింగ్‌కు, పైకప్పుకు మధ్య ఉన్న గోడకు నాలుగు పలకలుగా కన్నం వేసి దుండగులో షాపులోకి వచ్చినట్లు గుర్తించారు. అక్కడ రెండు మద్యం సీసాలు పడివుండడంతోపాటు అన్నం తిన్న ఆనవాళ్లు ఉన్నాయి. గోడ పగులగొట్టేందుకు ఉపయోగించిన పెద్దసైజు ఉలి కూడా లభ్యమైంది.
గోడను కట్ చేసేందుకు ఎలక్ట్రానిక్ కట్టర్ మిషన్‌కు ఉపయోగించే విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి కట్టర్ సహాయంతో గోడను కట్‌చేసి, ఉలితో గోడకు ఉన్న ఇటుకలను ఒక్కొక్కటి జాగ్రత్తగా తొలగించి మనిషి పట్టేవిధంగా నాలుగు పలకలుగా రంధ్రం చేసి, జాగ్రత్తగా కిందకు దిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షో కేసుల్లోని మూడు కిలోల బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లోని రూ.8 లక్షల నగదు అపహరించారు. వారు వెండి వస్తువుల జోలికి వెళ్లలేదు.
ఆభరణాల్లో బ్రాస్‌లెట్స్, నెక్లెస్‌లు, ఉంగరాలు, వంద గ్రాముల బరువుగల మూడు బంగారు బిస్కెట్లు ఉన్నాయి. మొత్తం రూ.70లక్షల నుంచి 80 లక్షల వరకు విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నారని బాధితుడు మణికంఠ తెలిపారు. తన తండ్రి పత్తి వ్యాపారానికి సంబంధించి రూ.8 లక్షల నగదును షాపులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
పోలీసులు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని కోణాల్లో పరిశోధన చేశారు. సాయంత్రం వచ్చిన డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలం నుంచి సత్తెనపల్లి రోడ్డులోని సాయిబాబా గుడివరకు వెళ్లి ఆగిపోయింది.
షాపు యజమానుల విచారణ.. షాపు యజమాని బొగ్గవరపు పుల్లారావు, ఆయన కుమారుడు మణికంఠలను విచారిం చారు. క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన పుల్లారావు రెండేళ్ల క్రితం అచ్చంపేటలో జ్యూయలరీ షాపు నెలకొల్పాడు. తాను పత్తి వ్యాపారం చేసుకుంటూ జ్యూయలరీ షాపును కుమారుడు మణికంఠకు అప్పగించారు.
ఆరు నెలలుగా మణికంఠ జ్యూయలరీ షాపు పూర్తి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. వారం రోజుల క్రితం షాపు పైకప్పు పాక్షికంగా దెబ్బతినడంతో మరమ్మతులు చేయించారు. ఈ క్రమంలో షాపులో చోరీ జరగడంతో తాపీ మేస్త్రీలు, విద్యుత్ వర్కర్లపైనా, ఇతరత్రా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యూయలరీ వ్యాపారం కూడా ఒడిదుడుకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చోరీ కేసును ఛేదిస్తామని ఏఎస్పీ శోభామంజరి పేర్కొన్నారు.