ప్రతిభావంతులకే కొలువు | Jobs for only talented people in village secretariat posts replacement | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకే కొలువు

Published Sat, Jul 20 2019 4:08 AM | Last Updated on Sat, Jul 20 2019 7:56 AM

Jobs for only talented people in village secretariat posts replacement - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సమర్ధులు, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో పలుమార్లు సమీక్షలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అభ్యర్థుల విధులు, అర్హతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, దాదాపు 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకాలు జరగనుండగా.. 2.80లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పనిచేసే వలంటీర్లను నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు తొలుత ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే, భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా కంప్యూటర్ల ఏర్పాటులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంతో రాత పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపారు. కాగా, సుమారు 20లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షకు ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించే అధికారుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

గ్రామ సచివాలయాల్లో పరీక్ష ఇలా..
గ్రామ సచివాలయాల్లో నియామకాల సంబంధించిన రాత పరీక్షను 150 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్, ఓఎంఆర్‌ విధానంలో జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 75 మార్కులకు జనరల్‌ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉండేలా ఆలోచిస్తున్నారు. నియామకాల్లో అభ్యర్థుల స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులకు 18–42 ఏళ్ల మధ్య వయోపరిమితి విధించాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ పోస్టును బట్టి అది మారే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు వికలాంగులకు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నారు.

వార్డు సచివాలయాల్లో పరీక్ష ఇలా..
వార్డు సచివాలయాల పరీక్షకు మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 50 మార్కులు ఎంపిక చేసిన సిలబస్, 50 మార్కులు వ్యక్తిత్వ సామర్థ్యం, 50 మార్కులు జనరల్‌ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తున్నారు. ఓఎంఆర్‌ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. అలాగే, పక్కా డ్రెయిన్లు, రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు వంటి విధులు నిర్వహించే అభ్యర్థులకు బీటెక్‌ను విద్యార్హతగా నిర్ణయించారు. ఇటువంటి అభ్యర్థులకు ఇంజనీరింగ్‌కు సంబంధించిన 50 ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 100 మార్కులు వ్యక్తిత్వ సామర్థ్యం, జనరల్‌ నాలెడ్జి్జకి సంబంధించినవి ఉంటాయి. పరీక్షకు రెండున్నర గంటల సమయాన్ని కేటాయించారు. పరీక్షలో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అనంతరం ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఈ పోస్టులకు 18ఏళ్లు నిండిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అదే విధంగా గరిష్ట వయో పరిమితిని 42ఏళ్లుగా నిర్ణయించినట్టు సమాచారం. రిజర్వేషన్లు యథావిధిగా అమలులో ఉంటాయి.

గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
గ్రామ సచివాలయాలలో ఉద్యోగుల నియామక ప్రక్రియ విధి విధానాలు ఖరారు చేసేందుకు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. నియామక ప్రక్రియ విధానాలు ఖరారుచేయడం, ఉద్యోగ నియమాకాలకు నోటిఫికేషన్‌ జారీచేయడం,  పరీక్ష నిర్వహణ వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తోంది. పట్టణాభివృద్ధి, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖల కమిషనర్లు, ఎల్‌ అండ్‌ వో అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌లు కమిటీ సభ్యులుగా ఉంటారు. 

ప్రాథమిక వేతనం రూ.15వేలు
ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్లపాటు శిక్షణాకాలం ఉంటుంది. ఈ సమయంలో వారికి రూ.15వేల వరకు వేతనం చెల్లించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాత వేతనాల పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎంపికైన వారందరూ ప్రభుత్వోద్యోగులేనని మున్సిపల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ తెలిపారు. పట్టణాల్లో ఏర్పాటుచేసే 3,786 సచివాలయాల్లో మొత్తం 34,723 మంది ఉద్యోగులను నియమించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. కాగా, నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీచేసే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement