ఉద్యోగాల విప్లవం తెస్తాం | Jobs Will Be Revolutionized | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల విప్లవం తెస్తాం

Published Tue, Apr 2 2019 8:30 AM | Last Updated on Tue, Apr 2 2019 8:31 AM

Jobs Will Be Revolutionized - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరుటౌన్‌: భీమవరం పట్టణం సోమవారం జన ప్రభంజనంతో హోరెత్తింది. పట్టణమంతా జగన్‌ నామస్మరణతో మారుమోగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి. ఆకాశం నుంచి చుక్కలు రాలిపడ్డాయా అన్నట్లు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వైఎస్‌ జగన్‌ సభా ప్రాంగణం వద్దకు రాగానే సీఎం..సీఎం అంటూ యువత, పార్టీ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వేలాదిగా తరలివచ్చిన వైస్సార్‌సీపీ సైన్యం మధ్య వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రజా సమస్యలపై ధ్వజమెత్తారు. గత పాలకుల లోపాలను తేటతెల్లం చేస్తూనే.. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు సుస్పష్టంగా వివరించారు. నేనున్నానంటూ మీ సమస్యలపై పోరాడే లోకల్‌ హీరో కావాలా... ఎక్కడో ఉండే సినిమా యా క్టర్‌ కావాలో మీరే తేల్చుకోవాలంటూ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. 


భీమవరం నియోజకవర్గంలో ప్రతి అడుగులోనూ ప్రతి సమస్యలోనూ నేనున్నాను అంటూ ఒక లోకల్‌ హీరో ఉన్నాడు. అదే మన శ్రీనన్న. ఒక లోకల్‌ హీరోకు, సినిమాల్లో యాక్టింగ్‌ చేసే ఇంకొక యాక్టర్‌కు పోలిక మీరే చేసుకోండి. ఈ నియోజకవర్గంలోని అనేక సమస్యలు ఈ ఐదేళ్ళ చంద్రబాబు ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయా.. ఇదే చంద్రబాబు, ఆయన పార్టనర్‌ ఏనాడైనా ప్రజల సమస్యలపై పోరాటం చేశారా. మీ ప్రతి సమస్యను పరిష్కరించి, భీమవరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు మీకు మేమున్నామంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భీమవరం బుధవారం మార్కెట్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. భీమవరం నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను, నరసాపురం పార్లమెంట్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుపై మీ చల్లని దీవెనలు ఉంచాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. 


దోచుకోవటమే  పనిగా పెట్టుకున్నారు 
ప్రజాసంకల్ప పాదయాత్ర భీమవరం గుండా సాగింది. ఆరోజు మీరందరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతీ బాధ నాకు గుర్తుంది. చెప్పిన ప్రతీ కష్టం ఈ రోజు నాకు గుర్తుంది.  ఇక్కడే ఇదే భీమవరం టౌన్‌లో నాన్నగారు 2008లో 82 ఎకరాలు సేకరించి పేద వాళ్లకు ఇళ్లు కట్టాలని పేదలకు ఇచ్చారు. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు సేకరించిన ఆ భూమిని ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ధాక్షిణ్యంగా లాక్కోవడం ఇక్కడే ఈ భీమవరంలోనే చూశాం. లాక్కుని ఈ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది ఏమిటంటే.. అవినీతితో కూడిన ఫ్లాట్లను కట్టే కార్యక్రమానికి నాంది పలికాడు. ఆశ్చర్యమేంటో తెలుసా ఆ ఫ్లాట్లల్లో సిమ్మెంట్‌ సబ్సిడీకి ఇస్తారు. ఆ అపార్ట్‌మెంట్లకు భూమి ప్రభుత్వందే కాబట్టి ఉచితంగా ఇచ్చింది. ఆ ఫ్లాట్లలో లిఫ్టులు ఉండవు, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ ఉండదు. ఇటువంటి ఫ్లాట్లను కట్టడానికి ఏ కాంట్రాక్టర్‌ను మనం అడిగినా కూడా అడుగుకు మహా అయితే  రూ.1000 అవుతుందని చెబుతారు. అదే ఇక్కడ 300 అడుగుల ఫ్లాట్లకు అడుగుకు రూ.2200 చొప్పున పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు అని ఇక్కడి పేద ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. 300 అడుగుల ఫ్లాట్లు అడుగుకు రూ.1000 కూడా కాదు అని అంటే రూ.3 లక్షలకు అందుబాటు అయ్యే ఆ ఫ్లాటు పేదవాడికి అడుగుకు  రూ.2200 చొప్పున అమ్ముతూ 300 అడుగులు అంటే రూ.6.40 లక్షలకు అమ్ముతా ఉన్న పరిస్థితి ఈ పేదవాడు వచ్చి నాకు  చెప్పి్పన మాట. ఆ ఆరు లక్షల చిల్లర ఫ్లాట్లలో రూ. లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, మరో రూ.లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట బాగానే ఉంది.

మిగిలిన రూ.3 లక్షలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు చంద్రబాబునాయుడు తీసుకున్న లంచాలకు 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.3 వేలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబునాయుడు ఆ లంచాలకు పేదవాడు 20 ఏళ్లపాటు నెలనెలా రూ.3 వేలు కడుతూ పోవాలట. ఆ ప్రతీ పేదవాడికి జగన్‌ అనే నేను మీ అందరికీ ఇవాళ చెబతా ఉన్నాను. చంద్రబాబు ఎన్నికల కోసమని చెప్పి ఆ ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి, ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫ్లాట్ల మీద ఏదైతే మీరు 20 ఏళ్లు పాటు నెలనెలా రూ.3 వేలు బ్యాంకులకు కడుతూ పోతా ఉన్నారో ఆ మొత్తం రూ.3 లక్షలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  మాఫీ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అని జగన్‌ అన్నారు. 


తాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు  
ఇదే భీమవరం నియోజకవర్గంలో అక్షరాలా తాగడానికి నీళ్లు లేవని ఆ రోజుల్లో ఆ దివంగత నేత 126 ఎకరాలు సేకరించి మంచినీటి చెరువులు కట్టి ఇక్కడి ప్రజలకు తాగడానికి నీటిని సప్లై చేశారని ప్రజలు చెప్పినప్పుడు సంతోషం వేసింది. ఇవాళ ఈ ఐదేళ్ల చంద్రబాబునాయుడి పాలనలోనే భీమవరం చుట్టు పక్కల ఇప్పటికీ కూడా తాగునీటి సమస్య ఉంది. ఈ ఐదేళ్లలో గ్రామాలకు తాగడానికి నీరు లేకపోతే ఈ పెద్దమనిషి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ గాడిదలు కాస్తా ఉన్నాడు అని ప్రశ్నించారు.


రోగాలతో ప్రజలు అవస్థలు 
ఇదే భీమవరం నియోజకవర్గంలో చెత్త వేసేదానికి డంపింగ్‌యార్డు కూడా లేదు. అంటే ఆ చెత్త మొత్తంగా టౌన్‌ మధ్యలోనే వేసే పరిస్థితి ఉంది. ఆ వాసనకు, ఆ దోమలకు పురుగులకు రోగాలు వచ్చి అవస్థలు పడుతున్నా కూడా కనీసం పట్టించుకునే వాడు కూడా ఈ ఐదేళ్లలో లేడు. ఈ చంద్రబాబు ప్రభుత్వం నిద్రపోతా ఉందా అని మీ అందరి తరపున  అడుగుతున్నా. చెత్తను మొత్తం యనమదుర్రు డ్రెయిన్‌లో పడేస్తా ఉన్నారు. రాజకీయాల్లో లబ్ది పొందేందుకు ఇదే యనమదుర్రు డ్రెయిన్లో అఫ్లియెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పెట్టి మొత్తం ప్రాజెక్ట్‌తో మొత్తం నీళ్లన్నీ శుద్ది చేస్తానని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట ఇచ్చాడు. నేను మిమ్మల్ని అడుగతా ఉన్నా ఈ ఐదేళ్లలో యనమదుర్రు డ్రెయిన్‌ శుభ్రం చేశారా అని నిలదీశారు.


ట్రాఫిక్‌ సమస్య తీరిందా? 
ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉందని అప్పట్లో నాన్నగారి హయాంలో మార్కెట్‌యార్డు వరకూ బైపాస్‌ రోడ్డు వేశారు. ఆ తర్వాత ఆ రోడ్డు అంగుళం కూడా ముందుకు సాగని పరిస్థితి మీ కళ్లెదుటే కనిపిస్తా ఉంది. నియోజకవర్గంలో రైతన్నలు అన్నా వరి ధాన్యం పండిస్తా ఉన్నాం మద్దతు ధర రూ.1550 అని చెప్తారు. కాని పంట చేతికి వచ్చే సరికి రూ.1200, 1300 క్వింటాలుకు రాని పరిస్థితి ఉందని మేము ఎలా బతకగలం అని  ఆవేదనతో అన్న మాటలు ఇవాళ్లకు కూడా నాకు గుర్తున్నాయి. ఆక్వా పరిస్థితి చూస్తే 100 కౌంటు రొయ్యల ధర కనీసం రూ.270 ఉంటేగాని కనీసం ఖర్చులు కూడా రావు, అటువంటిది ఇదే 100 కౌంటు రొయ్యల ధర రూ.200కు పడిపోవటంతో ఆక్వా రైతు పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా.


లోకల్‌ హీరో శ్రీనన్న
ఇక్కడే ప్రతీ అడుగులోనూ ప్రతీ సమస్యలోనూ నేనున్నాను అనంటూ ఒక లోకల్‌ హీరో ఉన్నాడు. అదే మన  శ్రీనన్న. ఒక లోకల్‌ హీరోకు, సినిమాల్లో యాక్టింగ్‌ చేసే ఇంకొక సినిమా యాక్టర్‌కు పోలిక మీరే చేసుకోండి అని జగన్‌ అన్నారు. ఐదేళ్ల చంద్రబాబునాయుడు  పాలన మీ అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఈ ఐదేళ్లలో ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలేమిటి? ఎన్నికల ప్రణాళిక, మ్యానిఫెస్టోలో రాసిన రాతలేమిటి? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పెద్దమనిషి చంద్రబాబు చేసిందేమిటి అన్నది మీరందరూ కూడా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయాలని కోరారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మన చూసింది మోసం చేయడమే అన్నారు. దేశంలోనే అత్యంత ధనిక చీఫ్‌ మినిస్టర్‌ ఎవరూ అంటే వినిపించేది చంద్రబాబు పేరేనన్నారు. చంద్రబాబు జీవితం రెండెకరాల నుంచి మొదలు పెట్టారు. ఈ రోజు దేశంలోనే అత్యంత ధనిక చీఫ్‌ మినిస్టర్‌ అయ్యారు. అంటే ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచేశాడో వేరే చెప్పాల్సిన పనిలేదన్నారు. మన లోకల్‌ హీరో గ్రంధి శ్రీనన్నకు మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరారు. రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా ఉంది. ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎంపీ అభ్యర్ధి కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్‌ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు, తాడేపల్లిగూడెం, ఉండి అభ్యర్ధులు కొట్టు సత్యనారాయణ, పీవీఎల్‌ నరసింహరాజు, కొయ్యే మోషన్‌రాజు, పాతపాటి సర్రాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వేండ్ర వెంకటస్వామి, గూడూరు ఉమాబాల, ఏఎస్‌రాజు, గాదిరాజు సుబ్బరాజు, మేడిద జాన్సన్, మంతెన బాబు, పేరిచర్ల విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబు పార్టనర్‌ యాక్టర్‌ ఒక్కసారైనా వచ్చారా? 
తుందుర్రులో ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం బారిన పడతామని, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తే ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసేసి సముద్రతీరానికి తీసుకుపోయి అవసరమైతే అంతో ఇంతో సహాయం చేసి అక్కడ పెడితే ప్రజలు, సంతోషించే వాళ్లు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా సంతోషించేవారు. అలా కాకుండా అక్కడే ఫ్యాక్టరీ పెట్టించి డ్రెయిన్లు నాశనమైన పరిస్థితులు కల్పించారు. తుందుర్రులో కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి అన్నా చంద్రబాబు ఎలాగూ సహాయం చేసింది లేదు. కనీసం అక్కడ ధర్నా చేస్తా ఉన్న ప్రజలకు కనీసం ఒక్కసారి అయినా నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి  ఈ యాక్టర్, చంద్రబాబు పార్టనర్‌ కనీసం ఒక్కసారైనా వచ్చారా అని నిలదీశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement