విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు | joining duty Strict actions | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు

Published Wed, Jun 18 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు

విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు

కలెక్టరేట్ (కాకినాడ) : ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లి తిరిగి వచ్చిన తహశీల్దార్లు తక్షణం విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ఆయన ఆర్డీవోలతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అనంతరం తిరిగి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు వివిధ మండలాల్లో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ పలువురు విధుల్లో చేరలేదు. దీనిపై మండిపడిన జేసీ బుధవారం సాయంత్రంలోగా   వారు విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమలాపురం డివిజన్‌లోని అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం; రామచంద్రపురం డివిజన్‌లోని అనపర్తి, రాయవరం; రాజమండ్రి డివిజన్‌లోని కడియం, సీతానగరం, ఆలమూరు; రంపచోడవరం డివిజన్‌లోని గంగవరం,
 
 రాజవొమ్మంగి తహశీల్దార్లు; కలెక్టరేట్‌లోని ఏవోతోపాటు హెచ్ సెక్షన్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్లు; రాజమండ్రి, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల ఏవోలు ఇంతవరకూ విధుల్లో చేరలేదు. నాలుగు రోజుల కిందట స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వారు బాధ్యతలు తీసుకోలేదు. వారందరూ బుధవారం సాయంత్రం లోగా విధుల్లో చేరాలని చివరిసారిగా జేసీ డెడ్‌లైన్ విధించారు. లేకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ధ్రువపత్రాల కోసం మీసేవా కేంద్రాల నుంచి వచ్చిన దరఖాస్తులు సుమారు 25 వేలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటికి నిర్దేశించిన గడువు పూర్తయినప్పటికీ ధ్రువపత్రాలు జారీ నిలిచిపోయిందన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవోలు సీరియస్‌గా తీసుకుని తక్షణమే పెండింగ్ దరఖాస్తులు క్లియర్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బీఆర్ అంబేద్కర్, కూర్మనాధ్, నాన్‌రాజ్, వరప్రసాద్‌తోపాటు పలువురు తీర ప్రాంత తహశీల్దార్లు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement