మంత్రి అనుచరులను అరెస్టు చేయాలి | Journalist Union Complaint Against Attack on Sakshi Reporter | Sakshi
Sakshi News home page

మంత్రి అనుచరులను అరెస్టు చేయాలి

Published Sat, Oct 21 2017 10:40 AM | Last Updated on Sat, Oct 21 2017 10:40 AM

Journalist Union Complaint Against Attack on Sakshi Reporter

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సాక్షి దినపత్రిక ఆళ్లగడ్డ విలేకరి వెంకట కృష్ణయ్యపై దాడి చేసిన మంత్రి అఖిలప్రియ అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయాలని,  ఈ దాడికి బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌ చేశాయి. జర్నలిస్టులపై దాడుల నివారణకు  ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరాయి. ఆళ్లగడ్డ విలేకరిపై గురువారం మంత్రి అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు, ప్రజాసంఘాలు ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాయి.   

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో...
జిల్లా కలెక్టరేట్‌లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. ఆ సంఘం జిల్లా అ«ధ్యక్షుడు అంబన్న మాట్లాడుతూ మంత్రి అనుచరులను తక్షణమే అరెస్టు చేయకపోతే చలో ఆళ్లగడ్డ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ దాడికి నిరసనగా యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని 54 మండలాలు, 14 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తున్నారని, మూడున్నరేళ్లలో వందల సంఖ్యలో విలేకరులపై దాడులు జరిగినా చర్యలు శూన్యమని విమర్శించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అనుచరులు రెచ్చిపోయి విలేకరులపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్, జమ్మన్న, సుబ్రమణ్యం, హుస్సేన్, మధు, అంజి, రాము, శేఖర్, స్నేహాల్, చాంద్, మధు, రాజ్‌న్యూస్‌ మధు, చెన్నయ్య, యూసుఫ్, ప్రతాప్, సీవీఆర్‌ యాగంటి, పోలకల్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
 
ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీజేఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ
కృష్ణయ్యపై దాడికి నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీజేఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట  గాంధీ విగ్రహం వద్ద  నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ చుట్టూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ..సాక్షి విలేకరిపై దాడి చేసిన మంత్రి అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే వెంకటకృష్ణయ్యకు రక్షణ కల్పించి ప్రభుత్వ సొమ్ముతోనే వైద్యం అందించాలని, కుటుంబ పోషణ కోసం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏపీజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృపావరం మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, మధుసుధాకర్‌  పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన జర్నలిస్టు సంఘాల నేతలు
సాక్షి విలేకరిపై దాడికి పోలీసుల వైఫల్యమే కారణమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి, జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు, ఏపీజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణతోపాలు పలువురు జర్నలిస్టు నాయకులు జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టికి ఫిర్యాదు చేశారు. ముందు నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు సక్రమంగా స్పందించకపోవడంతో దాడి జరిగినట్లు వారు వివరించారు. వ్యక్తిగత కారణాలతోనే విలేకరిపై దాడి జరిగినట్లు ఆళ్లగడ్డ పోలీసులు ఎస్పీకి నివేదిక ఇవ్వడం విచాకరమని, ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి విలేకరి కుటుంబానికి న్యాయం చేయాలని కోరగా..ఎస్పీ సానుకూలంగా స్పందించారు.  

జర్నలిస్టుపై దాడికి ఖండన
ఆళ్లగడ్డ సాక్షి విలేకరిపై దాడికి పాల్పడిన మంత్రి అఖిలప్రియ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నగర ప్రధాన కార్యదర్శి కే.వెంకటస్వామి, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.      

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
గూడూరు: సాక్షి దిన పత్రిక ఆళ్లగడ్డ విలేకరి వెంకటకృష్ణయ్యపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గోపినా««థ్‌జట్టి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. రోజురోజుకు విలేకరులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎస్పీ నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో విలేకరులు వి.శ్రీనివాసులు, కె.శ్రీనివాసనాయుడు, జి.ఉరుకుందు, కె.ప్రభాకర్, దౌలత్‌ఖాన్, పి.లక్ష్మన్న, తదితరులున్నారు. అంతకుముందు స్టేషన్‌లో రికార్డులు, కేసుల వివరాలు తెలుసుకున్నారు.

వెల్లువెత్తిన నిరసనలు
కర్నూలు (అర్బన్‌) :  సాక్షి ఆళ్లగడ్డ విలేకరి వెంకటకృష్ణయ్యపై దాడికి నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో  జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆదోని పట్టణంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన ప్రదర్శన, ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఓబులేసుకు వినతి పత్రం సమర్పించారు. ఆలూరు, çహŸళగుందలో తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చారు. బనగానపల్లె, కోవెలకుంట్లలో ధర్నా, ర్యాలీ నిర్వహించి..తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్లు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఏఐఎస్‌ఎఫ్, ఎమ్మార్పీఎస్‌ నేతలు రాస్తారోకో నిర్వహించారు. మంత్రాలయం, కోసిగిలో నిరసన తెలిపారు. నందికొట్కూరులోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై గంట పాటు రోస్తారోకో  చేపట్టారు.

నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్‌లో ఏపీయూడబ్ల్యూజే ,సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పత్తికొండలో వైఎస్సార్‌సీపీ, ఏపీయూడబ్ల్యూజే, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎమ్మిగనూరులో జరిగిన ఆందోళనలో సాక్షిబ్యూరో ఇన్‌చార్జ్‌ కేజీ రాఘవేంద్రరెడ్డి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు భాస్కర్‌యాదవ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న జర్నలిస్టులపై ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష దాడులు పెరిగిపోయాయని, ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్‌ చేశారు. ఆత్మకూరు పట్టణంలోని గౌడ్‌సెంటర్‌లో  ఆత్మకూరు డివిజన్‌ ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డోన్‌ పట్టణంలో జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించి.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పాణ్యంలో విలేకరులు, జర్నలిస్టు నేతలు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement