జై తెలంగాణ
Published Fri, Oct 4 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
సాక్షి ప్రతిని ధి, నిజామాబాద్ : జూలై 30న సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానాన్ని యథాతథంగా కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించింది. ఈ నిర్ణయం రావడం వెనుక తెలంగాణ వాదుల ఉద్యమ స్ఫూర్తి త క్కువేమి కాదని చెప్పవచ్చును. సత్వరమే పా ర్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ 65 రోజులుగా రాజకీయ జేఏసీతో సహా టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, సీపీఐ, పీడీఎస్‌యూ, ఏబీవీపీ, బీజేపీలు వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి. హైదరాబాద్‌లో జరిగి న సకల జనుల భేరి సభను విజయవంతం చేయడంలో కూడా జిల్లా రాజకీయ జేఏసీతో పాటు భాగస్వామ్యపక్షాలు కీలకభూమికను పోషించాయి. 60 ఏళ్లుగా తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్నప్పటికీ పుష్కరకాలంగా ఆ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది.
2009లో కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేయగా అదే బాటలో పలువురు విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. అమరవీరుల త్యాగాల ఫలితానికి తోడు కోట్లాది ప్రజల ఉద్యమ శక్తికి అధికార పక్షం తలవంచి ఈ నిర్ణయం తీసుకుం దని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. కేబినెట్‌లో తెలంగాణ నోట్ ఆమోదం పొందినప్పటికీ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టేంత వరకు ఉద్యమ స్ఫూర్తితో పోరాట కార్యక్రమా న్ని కొనసాగించాలని రాజకీయ జేఏసీతో పాటు తెలంగాణ వాదులు అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చాయి. హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి వర్గంలో ప్రవేశ పెట్టి న నోట్ ఆమోదానికి నోచుకోవడంపై తెలంగాణ వాదులు అత్యంత ఉత్సాహంతో సంబు రాలు జరుపుకున్నారు.
జిల్లా కేంద్రమైన నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్, డిచ్‌పల్లి తదితర ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ రంగోళిని మరిపించారు. నిజామాబాద్‌లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నివాసం వద్ద ఆ పార్టీ నేతలు సురేందర్, నగేష్‌రెడ్డి, కేశవేణు, కార్యకర్తలు,మహిళలు స్వీట్లు పంచుతూ టపాకాయలు కాల్చారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బస్వలక్ష్మీనర్సయ్య ఇంటి ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరా లు జరుపుకున్నారు.
టీఎన్‌జీవోఎస్ భవనం వద్ద ఉద్యోగులు, కార్మికులు విద్యార్థులు, జర్నలిస్టులు స్వీట్లు పంచారు. టపాకాయలు కాల్చా రు. జై తెలంగాణ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు, మహిళలు స్వీట్లు పంచి పెట్టారు. టపాకాయలను పేల్చా రు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి కృతజ్ఞత లు తెలుపుతూ జై తెలంగాణ నినాదాలు చేశా రు. బీజేపీ,సీపీఐ, న్యూడెమోక్రసీ మాత్రం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వర కు పోరాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
Advertisement