విజయవాడ : జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థి పూర్తిస్థాయిలో నష్టపోతాడని ఏపీ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్.. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మంత్రిని అసోసియేషన్ ప్రతినిధులు కలిసి మెమొరాండం అందజేశారు. పూర్వ పద్ధతినే కొనసాగించాలని కోరారు.
జంబ్లింగ్ విధానం వల్ల ఒక కాలేజీలోని విద్యార్థి మరో కాలేజీలో పరీక్షలు రాయాల్సి ఉంటుందని, అక్కడి పరిస్థితులు, పద్ధతులు అర్థం చేసుకునేలోపే పరీక్ష సమయం ముగిసే అవకాశం ఉందని వారు చెప్పారు. ఇదే స్థానిక కాలేజీలో అయితే ప్రాక్టికల్ నిత్యం నిర్వహించే గదుల్లోనే పరీక్షలు జరుగుతాయని, అందువల్ల విద్యార్థి త్వరితంగా పరీక్ష పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. యాజమాన్యాల మధ్య ఉండే పొరపొచ్చాలు కూడా విద్యార్థుల పరీక్షలపై ప్రభావం చూపిస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
జాతీయ,రాష్ట్రస్థాయిలో జరిగే ప్రధానమైన పోటీ పరీక్షల్లో ఈ మార్కులు కీలకంగా మారే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు ఈ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటే వెంటనే జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి గంటా స్పందిస్తూ అన్ని విషయాలు విద్యాశాఖ కమిషనర్‌తో చర్చించాలని సూచించారు. మంగళవారం సాయంత్రం సమగ్రంగా చర్చించేందుకు యాజమాన్యాల ప్రతినిధులను ఆహ్వానించారు.
ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన ప్రతినిధుల్లో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బైరపునేని సూర్యనారాయణ, కార్యదర్శి పీవీ రమణ, రాష్ట్ర కమిటీ నాయకులు వై.వెంకటేశ్వరావు, కేవీ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. సుమారు 300 మంది కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు రాష్ట్ర నలుమూల నుంచి విజయవాడకు తరలివచ్చారు.
జంబ్లింగ్‌తో విద్యార్థులకు తీవ్ర నష్టం
Published Mon, Jan 25 2016 7:11 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement