వ్యభిచార కూపంలో జూనియర్ ఆర్టిస్ట్
హైదరాబాద్ : వెస్ట్ జోన్ పరిధిలో రహస్యంగా సాగుతున్న వ్యభిచారం గృహంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేసి జూనియర్ ఆర్టిస్ట్ సహా ముగ్గురు యువతుల్ని పట్టుకున్నారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ కె.రామ్‌చంద్రన్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని మణికొండకు చెందిన వై.పూర్ణచంద్రారెడ్డి బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం ఏర్పాటు చేశాడు. ఇతడి వద్ద కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లకు చెందిన జి.సురేష్ సహాయకుడిగా పని చేస్తున్నాడు.
వీరిద్దరూ పొరుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన యువతుల్ని తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. సెల్‌ఫోన్ల ద్వారా విటులను ఆకర్షిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి నిందితులిద్దర్నీ అరెస్టు చేశారు.
జూనియర్ ఆర్టిస్టుతో పాటు కోల్‌కతా, కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతుల్ని వ్యభిచార గృహం నుంచి విడిపించారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.4,300 నగదు స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కాపాడిన అనంతపురం జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్టు పలు చిత్రాలతో పాటు టీవీ సీరియల్స్‌లోనూ నటించినట్లు సమాచారం.