చేయాల్సిందంతా చేసి నటనలా?
తిరుపతి అర్బన్ : ‘‘మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మించిన 300 పడకల గర్భిణీల భవనాలను స్విమ్స్‌కు కేటాయించే సమయంలో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మా ఆందోళనలు చూశాక నటనలు ప్రదర్శిస్తారా..? పేదల ప్రాణాలంటే లెక్కలేదా’’ అంటూ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ శాంతారామ్‌ను జూనియర్ డాక్టర్లు నిలదీశారు. దాంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ కాలేజీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
300 పడకల భవనాల సమస్యపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, రుయా-మెటర్నిటీ సూపరింటెండెంట్లతో నేరుగా చర్చించి స్విమ్స్‌కు అప్పగించే విధంగా నచ్చజెప్పే ప్రయత్నం కోసం డీఎంఈ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చి ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేశారు. ఈ సందర్భంగా 300 పడకల భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్లు డాక్టర్ జీ.పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి నేతృత్వంలోని జూ.డాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విష్ణుభరద్వాజ్, డాక్టర్ సత్యవాణి ఆధ్వర్యంలో వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 800 మంది రుయా నుంచి ప్రదర్శనగా మెడికల్ కాలేజీ సర్కిల్ వద్దకు చేరుకుని మానవ హారం నిర్వహించారు.
అక్కడి నుంచి బ్యానర్లు, ప్ల కార్డులు చేతబట్టి రాష్ర్ట ప్రభుత్వానికి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆందోళనల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర నాయకులు హరినాథరెడ్డి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ నాయకులు మెటర్నిటీ ముందు గర్భిణీలతో కలసి మహాధర్నా నిర్వహించారు. సోమవారం కావడంతో రుయా, మెటర్నిటీల ఓపీ విభాగాలకు రోగుల తాకిడి వేలల్లో కనబడింది. నిరసనలు, ఆందోళనల కారణంగా గర్భిణీలు, రోగులు నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చాంబర్‌కు వచ్చిన డీఎంఈని ఆందోళనకారులు అడ్డుకుని ఘెరావ్ చేశారు.
జూ.డాల నాయకులు డీఎంఈని నిలదీసి తమకు చెందిన హాస్పిటల్ భవనాలను స్విమ్స్‌లాంటి కార్పొరేట్ సంస్థకు ఇవ్వడం సరైంది కాదన్నారు. అందుకు డీఎంఈ బదులిస్తూ స్విమ్స్‌కు ఇచ్చేశాక మీరెందుకు ఆందోళనలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడంతో జూ.డాలు, హౌస్ సర్జన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఏది ఏమైనా 300 పడకల భవనాలను మెటర్నిటీకే చెందేలా జీవోలో మార్పులు చేయాలని, లేకుంటే పేద ప్రజలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.