లేవనెత్తిన సమస్యల తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించుకోవటానికి పట్టువిడుపులు ప్రదర్శించటం, గరిష్ఠంగా సాధించుకోవటం ఏ ఉద్యమానికైనా ఉండాల్సిన మౌలిక లక్షణాలు. పశ్చిమబెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు నెల రోజులకుపైగా సాగిస్తున్న ఉద్యమం ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాల్సి వుంది. ఆర్‌జీ కర్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో తమ సహచర వైద్యురాలు 36 గంటలు నిర్విరామంగా రోగులకు సేవలందించి సేదతీరిన నిశిరాత్రిలో దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి పొట్టనబెట్టుకున్న వైనం వెల్లడయ్యాక జూనియర్ డాక్టర్ల ఆగ్రహం కట్టలుతెంచుకుంది.
ఆ ఉద్యమాన్ని తుంచేయడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి గూండాలను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించిన తీరు వారిని మరింత రెచ్చగొట్టింది. ఉన్నతాదర్శాలతో ఈరంగంలో అడుగుపెట్టిన యువ వైద్యులను పాలనా నిర్వాహకులు వేధించుకు తినటం, మాఫియా లుగా మారటం, పాలకులు పట్టనట్టు వ్యవహరించటం వాస్తవం. తూట్లు పూడుస్తున్నట్టు కనబడు తూనే తూములు తెరిచిన చందంగా పాలకులు వ్యవహరించిన తీరు దాచేస్తే దాగని సత్యం. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు ఎటువంటివో, అవి ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఇవాళ దేశమంతా తెలిసింది.
కొంత హెచ్చుతగ్గులతో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దయనీయ స్థితిలోనే జూనియర్ డాక్టర్లు తమ వృత్తిని కొనసాగించాల్సి వస్తున్నదని కూడా అందరూ గ్రహించారు. ప్రజావైద్యరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవ్యవస్థ దళారీలనూ పెత్తందార్లనూ సృష్టించిందని, ఆ రంగాన్ని రోగగ్రస్తం చేసిందని జనంగుర్తించారు. దేన్నయినా రాజకీయ కోణంలోనే చూడటం అలవాటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్నుంచి కూడా అవలీలగా బయటపడగలమని తొలుత భావించారు. పైపై చర్యలతో ఉద్యమాన్ని సద్దుమణగనీయొచ్చని ఆశించారు. పరిస్థితి చేయి దాటుతున్నదనిఆలస్యంగా గ్రహించారు. గురువారం ఉద్యమకారులతో చర్చించడానికి రాష్ట్ర సెక్రటేరియట్‌లోరెండు గంటలకు పైగా వేచిచూసి, వారు వచ్చే అవకాశం లేదని గ్రహించాక రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ప్రజలకోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించారు. మొదట్లో సమస్య పరిష్కారానికి సిద్ధపడని ఆమె వైఖరివల్లనే సమస్య జటిలంగా మారిందన్నది వాస్తవం. వైద్య సాయం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపలువురు మరణించారు. ఈ పాపం నుంచి ఆమె తప్పించుకోలేరు. తన స్వభావానికి భిన్నంగా ఉద్యమం విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో ఉద్యమకారులను వేడుకోవటం, వారితో చర్చించటానికి సుదీర్ఘ సమయం వేచిచూడటం ఇది గ్రహించబట్టే. చేతులు కాలాక ఆకులు పట్టు కోవటం లాంటిదే ఇది.
అయితే ఉద్యమకారులుగా పట్టువిడుపులు ప్రదర్శించాలని జూనియర్ డాక్టర్లు కూడా గుర్తించాలి. ఉద్యమం విరమించి విధులకు హాజరు కావాలని ఇప్పటికి మూడుసార్లు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అలా చేరితే ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని మొన్న పదో తేదీన వారికి చెప్పింది కూడా. జరిగిన దుస్సంఘటనపై దర్యాప్తు జరపాలని, పని పరిస్థితులు మెరుగు పర్చాలని, జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని మొదట్లో కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్‌ను, మరికొందరిని తొలగించారు. పలువురిని అరెస్టు చేశారు.
జూనియర్ డాక్టర్లు లేవ నెత్తిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యమకారుల డిమాండ్లు పెరుగుతూ పోతున్నాయి. వైద్యరంగ ప్రక్షాళన కోసం వైద్య విద్యా డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని తాజాగా వారు కోరుతున్నారు. అంతే కాదు... తమతో మమత జరపదల్చుకున్న చర్చలను చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలనిడిమాండ్ చేశారు. అందుకు ఒప్పలేదన్న కారణంతో గురువారం చర్చలను బహిష్కరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చర్చలు ప్రజలందరూ చూసేలా జరగటంలో తప్పేముందన్నది వారి ప్రశ్న. వినటానికి సబబే అనిపించవచ్చు.
కానీ మమత అంటున్నట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగుతోంది. దానిపై బహిరంగ చర్చ మంచిదేనా? దుండగుల దాడిలో బలైపోయిన యువ వైద్యురాలి కుటుంబసభ్యుల గోప్యత ఏం కావాలి? ఉద్యమకారులు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. కానీ ఇప్పటికే తీసుకున్న చర్యలకు మించి వారేం ఆశిస్తున్నారనుకోవాలి?నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘవ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు లభించక తల్లడిల్లుతున్నారు. దాదాపు 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
8,000 మంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వైద్య సేవలు అందించలేమని సర్కారీ ఆస్పత్రులు చేతులెత్తేయటం వల్ల అంతంతమాత్రంగా బతుకీడుస్తున్నవారు సైతం రోగాలబారిన పడిన తమ ఆప్తుల్ని రక్షించుకోవటానికి అప్పులుచేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు తమ బాధ్యత గుర్తెరగాలి. పాలకులపై తమకున్న ఆగ్రహం దారితప్పి సామాన్యులను కాటేస్తున్న వైనాన్ని గమనించాలి. తమ డిమాండ్లకు సమాజం నుంచి సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్న తరుణంలోనే విధుల్లో చేరాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment