
హైకోర్టు ఘటనను ఖండిస్తున్నాం: జూపూడి ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ఆవరణలో లాయర్ల మధ్య చోటు చేసుకున్న సంఘటన, కొందరు న్యాయవాదులపై జరిగిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన కోర్టు ఆవరణలో.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేవిగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో ఇరుప్రాంతాలను అశాంతికి గురిచేసి ప్రజలను తన్నుకు చావండంటూ కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బాధ్యత వహించాల్సిన పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం తమకు పట్టనట్టు, కళ్లుండి గుడ్డివారిలా ప్రవర్తిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్ర భవితవ్యం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు.