రాష్ర్ట విభజన విషయంలో మేం మా అధినేత్రి సోనియా గాంధీని ఎదిరిస్తాం.. మీరు మీ అధినాయకుడు చంద్రబాబునాయుడిని ఎదిరిస్తారా..?
పలమనేరు, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన విషయంలో మేం మా అధినేత్రి సోనియా గాంధీని ఎదిరిస్తాం.. మీరు మీ అధినాయకుడు చంద్రబాబునాయుడిని ఎదిరిస్తారా..? అంటూ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ‘మీరసలే మంచి నటులు, రకరకాల వేషాలు వేసి సమైక్య రాష్ట్రం కోసం పాటుపడుతున్నారు.. ఇంకేదైనా ఓ వేషం వేసి మీ నాయకుడు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకొనేలా చూస్తే బాగుంటుంది’ అని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చురకలంటించారు.
వి.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అనుభవమున్న వ్యక్తికి రాష్ట్రం ముక్కలైతే జరిగే నష్టం తెలీదా..? అని బాబూనుద్దేశించి ప్రశ్నించారు. రాజకీయాలను బేరీజు వేసుకొని విభజన నిర్ణయాన్ని మార్చుకుంటే అందరూ సంతోషిస్తారని తెలిపారు. మేము రాష్ట్ర సమైక్యత కోసం సోనియాగాంధీపై ఒత్తిడి తీసుకొస్తున్నామని, మీరూ మీ నాయకునిపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన లేఖను వెనక్కి తెప్పించాలని ఎంపీనుద్దేశించి అన్నారు.