
కృష్ణా నదిని రెండో మూసీగా మారుస్తారా?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లు గురించి భయపడాల్సిన పనిలేదని, న్యాయస్థానాలు రైతులకు అండగా ఉంటాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్రెడ్డి అన్నారు. 'రైతు చైతన్య యాత్ర'లో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెరుమాక గ్రామంలో పలువురితో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధానికి భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు.
95 శాతం భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని ఏర్పాటుకానున్న గ్రామాల్లో ఉన్న పంట పొలాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించిన దాఖలు కనబడడం లేదని ఆరోపించారు. కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలకు ఇక్కడున్న పరిస్థితులూ పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కృష్ణా నదిని రెండో మూసీ నదిగా మారుస్తారా అని లక్ష్మణ్రెడ్డి ప్రశ్నించారు.